Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రం నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. దీంతో ఎన్నికల విభాగం అధికారులంతా 11న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై ఫోకస్ చేయనున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 4 లక్షల 1365 మంది 139 లొకేషన్లలోని పోలింగ్ స్టేషన్లలోని సుమారు 407 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తగ్గుతుండడాన్ని భారత ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నది. ప్రస్తుతం బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపునకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీలు, విద్య సంస్థల్లో ఓటరు అవగాహన, చైతన్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
దివ్యాంగులు లోపలికి వచ్చేలా..
ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద చేపట్టనున్న బందోబస్తు, మైక్రో అబ్జర్వర్ల విధి నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు మౌలిక వసతులైన విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు వంటివి ఖచ్చితంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు లోపలికి వచ్చేలా ర్యాంప్‌ను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలోని ఏర్పాట్లపై త్వరలో జిల్లా ఎన్నికల అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ బై ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో నగదు, మద్యం, విలువైన వస్తుల పంపిణీ వంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలపై ఫోకస్ పెట్టిన 45 ప్లైయింగ్ స్క్వాడ్ టీమ్ లు, మరో 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు, మరో నాలుగు వీడియో సర్వైలెన్స్ టీమ్ లు, రెండు వీడియో వ్యూహింగ్ టీమ్‌లు, నాలుగు అకౌంటింగ్ టీమ్‌లు తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు జరిపిన సీజింగ్‌ల వివరాలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 30వ తేదీన షెడ్యూల్ జారీ అయిన నాటి నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఎప్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ, పోలీసు బృందాలతో పాటు ఎక్సైజ్ అధికారులు సుమారు రూ.3 కోట్ల 31 లక్షల 7 వేల 990 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల విభాగం అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు సుమారు 127. 455 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు, దీని విలువ దాదాపు రూ.4 లక్షల 49 వేల 638 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మరో రూ.లక్ష 47 వేల 600 విలువైన 0.624 గ్రాముల గంజాయి, 0.011 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేసినట్లు వెల్లడించారు. దీనికి తోడు ఇప్పటి వరకు 22 ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
నేటి నుంచి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్‌గావ్, నాగ్రోట, రాజస్థాన్‌లోని ఆంట, ఝార్కండ్‌లోని ఘట్‌సిల, పంజాబ్‌లోని తన్ తరన్ , మిజోరాంలోని డంపా, ఓడిస్సాలోని నౌపాడా అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బిహార్‌లో కూడా గురువారం 6వ తేదీ నుంచి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నిషేధం ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల వరకు అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
