Generational Divide: తండ్రులు చెమటలు చిందిస్తూ బంతిని కొడుతుంటే, పక్కనే కొడుకులు చేతిలో మొబైల్ ఫోన్(Mobile Phone)లతో తలమునకలై ఉన్నారు. తరాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృశ్యం జోగిపేట(Jogipet)లోని క్రీడామైదానంలో కనిపించగా ‘స్వేచ్ఛ క్లిక్ గమనించింది. ప్రస్తుతం సామాజిక మార్పుల ప్రతిబింబంలా మారింది. ఒకప్పుడు ఆటలంటే పరిగెత్తే మైదానమని భావించిన పిల్లలు, ఇప్పుడు స్క్రీన్లలోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు.
సెల్‌ఫోన్‌ల మోజులో చిక్కుకున్న యువత..
మరోవైపు పెద్దవాళ్లు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మళ్లీ ఆటలవైపు మొగ్గుతున్నారు. సెల్‌ఫోన్‌ల మోజులో చిక్కుకున్న యువత తరం, శారీరక క్రీడల పట్ల ఆసక్తి కోల్పోతున్నారని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేము బాల్యంలో బంతి వెనుక పరిగెత్తేవాళ్లం, ఇప్పుడు మా పిల్లలు మొబైల్ వెనుక పరుగెడుతున్నారు‘ అని ఒక తండ్రి వ్యాఖ్యానించాడు. ఈ తరం వ్యత్యాసం తల్లిదండ్రులకు ఆలోచన కలిగిస్తోంది. వారాంతాల్లో ఆటల ద్వారా పిల్లలతో సమయం గడపాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ అవసరం అయినా, ఆరోగ్యం ప్రాధాన్యం మరిచిపోవద్దని పెద్దలు సూచిస్తున్నారు. పక్కనే ఉన్న మైదానంలో ఆడే తండ్రులు, పిల్లలకు స్ఫూర్తి కావాలని ఆశిస్తున్నారు.
