Forest Department: రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అఖిల భారత పులుల లెక్కింపు (ఏఐటీఈ-2026) కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన వలంటీర్లను ఆహ్వానిస్తున్నట్టు వన్య ప్రాణుల సంరక్షణ అధికారి ఈలు సింగ్ మేరు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి మానిటరింగ్ ప్రోగ్రామ్‌గా పేరుగాంచిన ఈ లెక్కింపును డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. పులుల లెక్కింపులో పౌరులు, విద్యార్థులు, వన్యప్రాణి అభిమానులు పాల్గొనవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Also Read:Forest Department: అటవీ అధికారుల నిర్లక్ష్యం.. నిధుల్లో కేంద్రం కోత?
వలంటీర్లు 18 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి
ఎంపికైన ప్రతి వలంటీర్ అటవీ సిబ్బందితో కలిసి ఏడు రోజులపాటు ట్రాన్స్‌క్ట్ వాక్స్ నిర్వహిస్తారు. రోజుకు 10–15 కిలోమీటర్ల దూరం నడుస్తూ, అడవుల్లో పులుల జాడలు, అడుగుల ముద్రలు, మల చిహ్నాలు, నివాస నాణ్యతా వంటి వివరాలను సేకరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వలంటీర్లు 18 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని, తక్కువ సౌకర్యాలతో దూర ప్రాంత క్యాంపుల్లో ఉండే సామర్థ్యం ఉండాలని మేరు పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రో-బోనో కార్యక్రమం (ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు) అయినప్పటికీ, వసతి ఫీల్డ్ రవాణా ఖర్చులను అటవీ శాఖ భరిస్తుందని తెలిపారు. ఆసక్తి గల వలంటీర్లు తెలంగాణ అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.
పెరుగుతున్న పులుల సంఖ్య
కాగా, గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2022లో పులుల సంఖ్య 3,967 గా నమోదైంది. 2006లో 1,411 నుంచి నిరంతరంగా పెరుగుతున్న సానుకూల ధోరణిని ఈ సంఖ్య సూచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా పులుల సంఖ్య పెరుగుతూ వస్తోందని, ముఖ్యంగా అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్యతో పాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని అధికారి తెలిపారు. ఏఐటీఈ-2026లో దేశంలోని 8.27 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 65,000కు పైగా అటవీ బీట్లను కవర్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుమారు 26,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల 3,000కు పైగా బీట్ల నుండి డేటా సేకరించనుంది. డెక్కన్ ప్రాంతంలో అత్యధికంగా పాల్గొనే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తుందని ఆయన వివరించారు.
Also Read: Forest Staff Sports: అటవీ శాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
