Forest Department: కేంద్రం నిధులు కేటాయిస్తున్నా వాటిని రాబట్టడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. సరైన వార్షిక కార్యచరణ లేకపోవడం, ప్రణాళిక రూపొందించడంలో జాప్యంతో కేంద్రం కేటాయించిన నిధుల్లో నామమాత్రంగానే రిలీజ్ అవుతున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అటవీశాఖ(Forest Department) అధికారులు మాత్రం తమతప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం నిధులు విడుతలవారీగా రిలీజ్ అవుతాయని చెప్పుతుండటం గమనార్హం. దీంతో ఉన్నతాధికారుల పనితీరు సైతం ఎలా ఉందోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిధుల్లో భారీగా కోత
ప్రతి ఏటా కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సైతం వార్షిక ప్రణాళికలు అందజేయాల్సి ఉంటుంది. ఆ ప్రణాళికలు అందగానే నిధులు మంజూరుచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ హాబిటాట్(Integrated Development of Wildlife Habitat) స్కీమ్ కింద వన్యప్రాణి ఆవాసాల సంరక్షణ, అభివృద్ధికి ఏటా నిధులు కేటాయిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అటవీ అధికారుల నిర్లక్ష్యంతో కేంద్రం కేటాయించే నిధుల్లో భారీగా కోత పడుతుంది. గత ఐదేళ్లలో ఈ స్కీమ్ కింద రూ.47.38 కోట్లు కేటాయించినా రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.15.47 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే సుమారు 32% మాత్రమే. మరో రూ.31.91 కోట్ల నిధులు కోత పడిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. సంబంధితశాఖ అధికారుల వార్షిక కార్యాచరణ ప్రణాళికల (ఏపీఏ) లోపం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి కేంద్రం నిధులు రావడం లేదని సమాచారం.
అక్రమ కలప రవాణా
అటవీశాఖలో విభాగాల మధ్య సమన్వయ లోపం, వార్షిక కార్యాచరణ ప్రణాళికలు సమర్పించకపోవడంతో కేంద్ర నిధులు పూర్తిగా విడుదల కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఐడీడబ్ల్యూహెచ్(IDWH) కింద రూ. 31.91 కోట్లు, టైగర్ ప్రాజెక్టు, ఎలిఫెంట్ కింద రూ. 10.82 కోట్లు రాలేదు. దీంతో అటవీ ఆవాసాల సంరక్షణ, నీటి తొట్టెల ఏర్పాటు, గస్తీ బృందాల నిర్వహణ, వేట నిరోధక చర్యలు, మానవ-వన్యప్రాణి సంఘర్షణల నివారణ వంటి కార్యక్రమాలకు చేపట్టలేకపోతున్నారు. ఆదిలాబాద్(Adhilabadh), మంచిర్యాల, నిర్మల్(Nirmal), ఆసిఫాబాద్(Asifabadh), కొత్తగూడెం(Kothagudem), భూపాలపల్లి(Bhupalapally), ములుగు(Mulugu), వరంగల్(warangal), అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో చిరుతల దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వందల సంఖ్యలో మానవ-వన్యప్రాణి సంఘర్షణలు జరిగాయి. అంతేకాకుండా, అక్రమ కలప రవాణా, భూకబ్జాలు, మైనింగ్ తో అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు అలర్టు కాకపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలోనూ వైఫల్యం చెందుతున్నారు.
Also Read: SC on Aadhar card: పౌరసత్వానికి ‘ఆధార్ ప్రూఫ్ కాదు’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
అధికారుల పనితీరును స్పష్టం
కేంద్రం ప్రతి సంవత్సరం వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, ప్రాజెక్ట్ టైగర్(Project Tigar), ఎలిఫెంట్ కింద నిధులు కేటాయిస్తోంది. ఆవాసాల పరిరక్షణ, వేట నిరోధక చర్యలు, పర్యావరణ అభివృద్ధి, మానవ-వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించడానికి ఈ నిధులు దోహద పడనున్నాయి. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ అభివృద్ధికి కీలకమైన టైగర్ ప్రాజెక్ట్, ఎలిఫెంట్ సబ్-స్కీమ్‌ల కింద కేంద్రం రూ.14.34 కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ.3.52 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. లోక్ సభలో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి ఉప పథకం కింద తెలంగాణకు ఐదేళ్లలో కేటాయించిన నిధుల వివరాలే అధికారుల పనితీరును స్పష్టం చేస్తున్నాయి.
2020-21లో రూ.1.13 కోట్ల కేటాయించగా అందులో రూ.37 లక్షలు మాత్రమే కేంద్రం విడుదల చేసినట్లు ప్రకటించింది. 2021-22లో రూ.9.87 కోట్లకు రూ.5.43 కోట్లు, 2023-24లో రూ.11.82 కోట్లకు రూ.3.23 కోట్లు, 2024-25లో రూ.10.21 కోట్లకు రూ.2.92 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అధికారుల వైఫల్యంతో 2022-23లో నిధులు కేటాయించలేదని సమాచారం. అంతేకాదు 2023-24, 2024-25 సంవత్సరాల్లో సైతం కేంద్రం నిధులు ఇవ్వలేదు. క్లారిటీలేని ప్రతిపాదనలు, సకాలంలో కార్యాచరణ, ప్రణాళికలను కేంద్రానికి అందజేయకపోవడంతో నిధుల విడుదలలో జాప్యం, కోతలు విధిస్తున్నట్లు సమాచారం.
నిధుల విడుదలలో జాప్యం
అటవీశాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉండటంతోనే కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లలో పెట్రోలింగ్, ఆవాసాల మెరుగుదల, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేట నిరోధక చర్యలు, అటవీ ఆక్రమణల నివారణ, పర్యావరణ పర్యాటక అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పలువురు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల అటవీ క్షీణత, వన్యప్రాణుల ఆవాసాల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని మరోవైపు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు సకాలంలో సమగ్ర ప్రణాళికలు సమర్పించడంతోపాటు సమన్వయంతో పనిచేస్తే కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో పొందే అవకాశం ఉంది. నిధుల కొరతను అధిగమించి, తెలంగాణ అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ఊతమిచ్చేందుకు అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.
మంత్రి చొరవ తీసుకుంటేనే..
కేంద్రం నుంచి తెలంగాణకు ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ హాబిటాట్స్ పథకంనిధులు రాబట్టాలంటే మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రణాళికలు పంపడంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తే తప్ప వారు అలర్టుకారనే ప్రచారం జరుగుతుంది. అటవీశాఖలో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యం, విధినిర్వహణలోనూ అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులపై మంత్రి నిఘా పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులపై సమీక్ష చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంపా నిధుల రాబట్టడంలోనూ జరుగుతున్న జాప్యంపైనా ప్రత్యేక దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Watch Video: క్లాస్ రూమ్‌లో విషాదం.. ఫ్రెండ్స్ కళ్లెదుటే మరణించిన విద్యార్థి.. వీడియో వైరల్!