Huzurabad News: బేడ బుడగ జంగాల కాలనీ అభివృద్ధిపై దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు(Siripati Venu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం, కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన సిరిపాటి వేణు, తమ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో సెన్సెస్ ప్రీ టెస్ట్ ప్రారంభం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
కలెక్టర్ల దృష్టికి ఎన్నోసార్లు..
ఈ సందర్భంగా కమిషనర్‌కు వినతిపత్రం (మెమొరాండం) సమర్పించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో సీసీ రోడ్లు(CC Roads), డ్రైనేజీ కాలువలు, మిషన్ భగీరథ పైప్‌లైన్లు, వీధి లైట్లు లేకపోవడంతో వర్షాకాలంలో మురికి నీరు నిలిచిపోయి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను స్థానిక నాయకులు, అధికారులు, కలెక్టర్ల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆయన ఆరోపించారు. నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి. కాలనీలో తక్షణమే సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, స్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్ నిర్మించాలి. మున్సిపాలిటీకి మంజూరైన రూ. 15 కోట్ల నిధుల నుండి తమ కాలనీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. అభివృద్ధి ఉన్నచోటనే కాకుండా, అభివృద్ధి లేని ప్రాంతాలనూ డెవలప్ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో త్వరలోనే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద 2000 మందితో భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు.
Also Read: Road Accidents Report: ఏపీలో 20 వేల రోడ్డు ప్రమాదాలు.. 8 వేల మరణాలు.. వెలుగులోకి సంచలన రిపోర్ట్
