DGP Sivadhar Reddy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద స్థలిని డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీని ఢీకొట్టడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని డీజీపీ ధ్రువీకరించారు. బస్సును గుద్దుకుంటూ 40 మీటర్ల మేర టిప్పర్ ముందుకు లాక్కెళ్లిందని అన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ వైపు కూర్చున్నవారు అధికంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఘటనాస్థలిలో మలుపు ఉందన్న డీజీపీ.. అయితే అది ప్రమాదం అయ్యేంత టర్నింగ్ కాదని పేర్కొన్నారు.
చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు
చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే.. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. చేవెళ్ల ఏసీపీ దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ కండిషన్ ను మెకానిక్ ద్వారా పరీశీలిస్తున్నామని తెలిపారు. మరోవైపు టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ నాయక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నట్లు డీజీపీ చెప్పారు.
‘ఇది అందరి బాధ్యత’
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయ దుమారం రేగిన వేళ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదని హితవు పలికారు. ‘ఇది అందరి బాధ్యతగా చూడాలి. రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. రోడ్డు మీద డ్రైవ్ చేసే వారు డిఫెన్స్ కండిషన్ ను అంచనా వేసుకొని డ్రైవ్ చేయాలి. రోడ్డు ప్రమాదాలపై వచ్చే నెల నుండి అవగాహనా కార్యక్రమాలు చేపడతాం’ అని డీజీపీ చెప్పుకొచ్చారు.
Also Read: CM Revanth Reddy: జర్మనీ టీచర్లను నియమిస్తాం.. విద్యార్థులకు భాష నేర్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
హెచ్ఆర్‌సీ ఆగ్రహం
ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. సుమోటోగా కేసు నమోదు చేసింది. అంతే కాకుండా చేవెళ్ల – తాండూరు మధ్య ప్రాంతాన్ని డెత్ కారిడార్ గా హెచ్ఆర్‌సీ అభివర్ణించింది. రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం, డివైడర్లు లేకపోవడం, అతి వేగం, ఓవర్ లోడింగ్, హైవే విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా అనేక ప్రాణాంతక ప్రమాదాలు.. ఆ మార్గంలో చోటుచేసుకున్నాయని పేర్కొంది. నిబంధనల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా హెచ్ఆర్‌సీ మండిపడింది. ఘటనపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
