Warangal: మొంథా తుఫాన్ వరంగల్ ను అతలాకుతలం చేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 118 కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్-హనుమకొండ జిల్లాలను మొంథా తుఫాన్ ముంచెత్తింది. కాపువాడ, 100 ఫీట్ల రోడ్డు పరిసర కాలనీలు, హంటర్ రోడ్డు, వివేక్ నగర్, ప్రగతి నగర్, రామన్నపేట, ఉర్సు, సమ్మయ్య నగర్, టీఎన్జీవో కాలనీ, పోతన రోడ్డు ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీళ్ళు ప్రవహించడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించి, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పలు కాలనీల్లో రోడ్లపై వరదలో కార్లు, పలు వాహనాలు కొట్టుకుపోయాయి. రాత్రి నుంచి పలువురు బాధితులు ఇండ్లలో బిక్కు బిక్కు మంటూ గడిపారు.
భీమదేవరపల్లిలో 41.9 సెంటీమీటర్ల రికార్డు స్థాయిలో వర్షపాతం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయింది. భారీ ధాటికి బుధవారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో కల్వర్టులోకి నీరు వెళ్లడానికి తీసిన కాలువలో పడి అప్పని నాగేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. విశ్వనాథ కాలనీలో కాలువకు గండిపడి పంట పొలాల్లోకి నీరు చేరుతోంది. బొల్లోనిపల్లిలో సుమారు 25 ట్రాక్టర్ ట్రిప్పుల ధాన్యం కుప్పలు వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గట్ల నర్సింగాపూర్ గ్రామంలో వరద నీటి ప్రవాహానికి రహదారి కొట్టుకుపోయింది. పలు గ్రామాలలో ధాన్యం తడిసిపోయి రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు.
మహిళ ఇంటి గోడ కూలి మృతి
కొత్తకొండ మల్లరం రహదారి తెగి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి సమయంలో తెగిన రోడ్డు డ్రైవర్ గమనించకపోవటంతో ఈకో కారు తెగిపోయిన రహదారిలో ఇరుక్కుపోయింది. గట్ల నర్సింగ పూర్ వరద ప్రవాహానికి తెగిపోయిన రహదారిలో వరద ప్రవాహంలో ప్యాసింజర్ ఆటో కొట్టుకుపోయింది. వరదతో వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టం అయ్యింది. ఐనవోలు మండలం కొండపర్తి ఎస్సీ కాలనీలో గద్దల సూరమ్మ (60) అనే మహిళ మంచంలో నిద్రిస్తుండగానే ఆమెపై ఇంటి గోడ కూలిపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్ట కు చెందిన కోలా రామక్క(65) మట్టిగోడ కూలిపోవడంతో మృతి చెందారు.
తెగిన గోపాల్ పూర్ చెరువు కట్ట
హనుమకొండ గోపాల్ పూర్ ఊర చెరువు కట్ట తెగిపోవడంతో హనుమకొండ కు పెను ప్రమాదంగా మారింది. ప్రగతినగర్, వివేక్ నగర్, అమరావతి నగర్ నయీం నగర్ ప్రమాదపు అంచుకు చేరుకున్నాయి. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి తమను ఆడుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
పాలకుల నిరక్ష్యం.. గ్రేటర్ ప్రజలకు శాపం
నాలాల ఆక్రమణ, అక్రమంగా నాలలపై నిర్మాణాలు చేపట్టడం, చెరువులు ఆక్రమణ గురైన పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే చిన్నపాటి వర్షానికి కూడా వరంగల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు వరదలో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ భయాందోళన మధ్య బతకాల్సిన పరిస్థితి వస్తుందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాలాలపై అక్రమ కట్టడాలను తొలగించి వరదలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజల కోరుతున్నారు.
Also Read: Warangal: పిల్లల ప్రాణాలు అంటే మీకు లెక్క లేదా? వరంగల్ ఎంజీఎంలో దారుణ ఘటన
