RBI-Gold (Image source twitter)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Gold Repatriation: యూకే నుంచి 274 టన్నుల బంగారం పట్టుకొచ్చిన ఆర్బీఐ.. ఎందుకు?, ఏం జరగబోతోంది?

Gold Repatriation: అలంకార ఆభరణాలుగా, పెట్టుబడి సాధనంగా భారతీయులు అమితంగా ఇష్టపడే బంగారం ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. గత రెండేళ్ల వ్యవధిలో చూస్తుండగానే అమాంతం పెరిగిపోయి కొండెక్కి కూర్చుంది పసిడి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిశ్శబ్దంగా, యూకేలో భారీ ఎత్తున నిల్వ ఉన్న మన బంగారం నిల్వలను పెద్ద ఎత్తున భారత్‌కు తరలించింది. ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది మార్చి – సెప్టెంబర్ మధ్యకాలంలో ఏకంగా 64 టన్నుల బంగారాన్ని ప్రత్యేక భద్రతతో ఇండియాకు (Gold Repatriation) పట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలో, మనదేశం అసలు యూకేలో మొత్తం ఎంత బంగారాన్ని దాచిపెట్టింది?, ఎప్పుడు, ఎక్కడ దాచిపెట్టింది?, అసలు ఇప్పుడెందుకు తీసుకొస్తోంది?, ఇంత బంగారాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రెండేళ్లక్రితమే గోల్డ్ తరలింపు ప్రక్రియను ఆర్బీఐ  మొదలుపెట్టింది. అంటే, 2023 మార్చి నుంచి బంగారాన్ని మన దేశానికి తరలించడాన్ని షురూ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రమక్రమంగా మొత్తం 274 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది. తద్వారా మన దేశ పసిడి నిల్వలు నిండుకున్నాయి. దీంతో, ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారంలో మూడింట రెండొంతులు ప్రస్తుతం దేశంలోనే భద్రంగా ఉన్నట్టు అయింది.

1991లో తరలింపు.. కారణాలు ఇవే

నిజానికి, బ్రిటీష్ పాలనా కాలం నుంచే యూకేలో బంగారాన్ని దాచిపెట్టడం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే, 1991-92 ఆర్థిక సంక్షోభ సమయంలో మన దేశం అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయి విదేశీ వాణిజ్యంలో సంక్లిష్టంగా మారిపోయింది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సమయంలో అత్యవసరంగా విదేశీ కరెన్సీని సమీకరించాల్సిన పరిస్థితి దాపరించింది. దీంతో, 1991లో పెద్ద ఎత్తున నౌకల ద్వారా బంగారాన్ని అక్కడికి తరలించి ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’లో ఆర్బీఐ తాకట్టు పెట్టింది. కావాల్సిన విదేశీ కరెన్సీని సేకరించి, ఆర్థిక వ్యవస్థను నడిపించింది.

ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లించాల్సిన అప్పు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం, భద్రత కారణాలను పరిగణనలోకి తీసుకొని బంగారం అక్కడే ఉండడం మంచిదని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయంగా బంగారు మార్కెట్లలో లండన్‌ కూడా కీలకమైనది కావడంతో అక్కడే పసిడిని నిల్వ చేస్తే లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చని భావించారు.

Read Also- Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

విదేశాల్లో ఇంకెంత బంగారం ఉంది?

ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, 2025 సెప్టెంబర్ చివరి నాటికి మన దేశం వద్ద దాదాపుగా 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తంలో దేశీయంగా దాదాపు 575.8 టన్నుల బంగారం నిల్వ ఉండగా, సుమారుగా 290.3 టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాలలోనే ఉంది. ఈ బంగారం ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) ఆధీనాల్లో ఉంది. తీసుకొచ్చిన బంగారాన్ని ముంబై, నాగ్‌పూర్‌లోని ఆర్బీఐ కేంద్రాలలో ఈ బంగారాన్ని నిల్వ చేస్తారు.

ఇప్పుడెందుకు తీసుకొస్తున్నారు?

బంగారాన్ని తిరిగి స్వదేశానికి తరలించడం వెనుక ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన విదేశీ కరెన్సీ నిల్వలను స్తంభింపజేయడం ఒక్క భారతదేశాన్నే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులను ఆలోచనలో పడేసింది. విదేశాల్లో తమ నిధుల భద్రత పట్ల పునరాలోచనలో పడ్డాయి. ఏవైనా అనూహ్య పరిస్థితులు ఏర్పడితే అంతపెద్ద సొమ్ము మనది కాకుండా పోతుందని ఆర్బీఐ ఆందోళన చెందింది. అందుకే, విదేశీ శక్తుల చేతుల్లో బంగారం చిక్కుకోకూడదనే ఉద్దేశంతో బంగారం తరలింపునకు పూనుకుంది. మనం బంగారం మన దగ్గర ఉండడమే సేఫ్‌ అని భావిస్తోంది. ఇక, రెండవ కారణం విషయానికి వస్తే, మన బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో డిపాట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ‘కస్టడీ ఛార్జీలు’ భరించాల్సి వస్తోంది. బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చి క్రమంగా ఆ భారాన్ని తగ్గించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే, విదేశీ, దేశీయ నిల్వల మధ్య బ్యాలెన్స్‌ను చేసుకోవచ్చనేది ఆలోచనగా ఉంది.

Read Also- Viral Accident: ఆ చిన్న రోడ్డు ప్రమాదానికి.. యావత్ దేశమే షాక్.. అంతలా ఏం జరిగిందంటే?

తీసుకొచ్చాక ఏం జరుగుతుంది?

భారీ మొత్తంలో బంగారాన్ని భారతదేశానికి తరలించినప్పటికీ ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తక్షణమే అంతపెద్దగా ఉండదు. రూపాయి స్థిరత్వం, విదేశీ మారక నిల్వల మెరుగుదలకు ఉపయోగపడతాయి. బంగారం తరలింపును ప్రస్తుతానికి మన దగ్గర సురక్షితంగా దాచిపెట్టుకుంటున్నామనే భావన ప్రధానమైనది. అయితే, దీని ప్రభావం భవిష్యత్తులో వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. అలాగే, మన ఆస్తులకు భద్రత కల్పించే విషయంలో మన సామర్థ్యంపై విశ్వాసం కూడా పెరుగుతుందని అంటున్నారు.

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు