Jubliee Hills Bypoll: ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండడంపై భారత ఎన్నికల సంఘం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ క్రమంలో, వచ్చే నెల 11న జరగబోయే జూబ్లీహిల్స్‌తో సహా దేశవ్యాప్తంగా జరిగే ఉపఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ‘స్వీప్’ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసింది. కొత్తగా నమోదైన విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడంపై ఇప్పటికే దృష్టి సారించిన సిబ్బంది, త్వరలోనే ఈ ప్రయత్నంలో జీహెచ్‌ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగాన్ని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది.
కర్ణన్ కీలక భేటీ
ఈ కార్యాచరణపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ సోమవారం అదనపు కమిషనర్‌ల (ఎలక్షన్, యూసీడీ)తో కీలక సమావేశం నిర్వహించారు. ఇకపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు యూసీడీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. గత ఏడాది (2023 నవంబర్) అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నమోదైన 48.82% పోలింగ్‌ను ఈసారి కనీసం అదనంగా పది శాతం పెంచాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓటు హక్కుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి, జీహెచ్ఎంసీ పరిధిలోని మహిళా స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మహిళా సభ్యులు.. ఎన్నికల సిబ్బందితో కలిసి ఓటరు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చి, అనంతరం వారిని క్షేత్రస్థాయికి పంపాలని అధికారులు నిర్ణయించారు.
Also Read: Trains cancelled: చలికాలం ఎఫెక్ట్.. 3 నెలల పాటు రైళ్లు రద్దు.. భారతీయ రైల్వే షాకింగ్ ప్రకటన
ఓటర్ల సంఖ్య పెరుగుదల
ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు అనుమతి ఇవ్వడంతో, నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ మొత్తం ఓటర్లు 4,00,365 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 25 మంది ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. వీరి కోసం 139 ప్రాంతాల్లో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో సుమారు 9 పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1233 మంది ఓటర్లుండగా, 263 పోలింగ్ స్టేషన్లలో 540 మంది ఓటర్లున్నట్లు, ఇక 1200 కన్నా ఎక్కువ మంది ఓటర్లు సుమారు 11 పోలింగ్ స్టేషన్లలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కేటగిరీ వారిగా ఓటర్లు..
ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ లో కేటగిరి వారీగా ఓటర్ల లెక్కలు పరిశీలిస్తే.. జనరల్ కోటాలో 2,08,561 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు 1,92,779 మంది ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నారు. వీరు కాకుండా ఇతరులు (ట్రాన్స్ జెండర్లు) 25 మంది ఉన్నారు. అలాగే సర్వీసు ఓటర్లు 18 మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు 123 మంది, 18-19 ఏళ్ల ఓటర్లు 6,859 (యువకులు 3781 మంది, యువతులు 3078 మంది), 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 6,053 మంది, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,134 మంది ఉన్నారు.
