GHMC: మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), మహిళా పొదుపు సంఘాలకు సంబంధించిన ఇదివరకు రూపొందించిన మార్గదర్శకాల్లో జీహెచ్ఎంసీ పలు కీలక సవరణలు చేసింది. గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక బృందాలను పెంచడం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు, ఈ బృందాల మార్గదర్శకాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పలు మార్పులు చేస్తూ, రుణాలు మంజూరు చేసే దిశగా బ్యాంకర్లకు సరికొత్త ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసింది. ఇదివరకున్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతులను మాత్రమే బృందాల్లో చేర్చుకోవాల్సి ఉండగా, ఈ నిబంధనను సడలించి 15 ఏళ్లు దాటిన యువతులను కూడా మహిళా సంఘాల్లో చేర్చుకోవాలని కమిషనర్ సూచించినట్లు సమాచారం.
Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
60 ఏళ్లు దాటినా..
మహిళలు యువతుల దశ నుంచే ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరుల పెంపుపై అవగాహన పెంచుకుంటేనే ఆర్థికాభివృద్ధి సాధించగలరన్న సంకల్పంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కమిషనర్ చేసిన మరో ముఖ్యమైన సవరణ ప్రకారం, ప్రస్తుతం మార్గదర్శకాలలో ఉన్న విధంగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా కొనసాగుతున్న మహిళలు 60 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ, 60 ఏళ్లు నిండిన మహిళలు తమకు ఇష్టమున్నంత కాలం స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా కొనసాగవచ్చునని ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. ప్రతి మహిళను స్వయం సహాయక బృందాల్లోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
రూ.454.68 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో సుమారు 55 వేల 897 స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కొత్తగా 4,842 బృందాలను ఏర్పాటు చేసి, వాటికి సుమారు రూ.454.68 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను కూడా మంజూరు చేయించినట్లు యూసీడీ అధికారులు వెల్లడించారు. అదనపు కమిషనర్ (యూసీడీ) ఎస్. పంకజ బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభుత్వం ఇచ్చిన కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న నినాదం మేరకు ప్రస్తుతం ఉన్న బృందాలను రెండింతలు అంటే లక్షా పది వేల పైచిలుకు స్వయం సహాయక బృందాలుగా పెంచాలన్న లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వచ్చే మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నందున సిబ్బంది కొత్త బృందాలను వేగవంతంగా ఏర్పాటు చేయాలని పంకజ సూచించారు. వీటితో పాటు వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి స్కీమ్ కింద రుణాలు ఇప్పించడం, ఆహార భద్రత కిట్లతో పాటు ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్లు అందించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ పనుల్లో అలసత్వానికి చెక్.. పనుల వేగం కోసం డ్యాష్ బోర్డు ఏర్పాటు
