Nagarkurnool district: శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేసి విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల త్యాగాలు వెళ్లకట్టలేనివని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, (Nagarkurnool district) జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
పోలీసుల సేవలు, వారి త్యాగాలు అమూల్యం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ శాంతి భద్రతలు స్థిరంగా ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ఫలాలు సమర్ధవంతంగా చేరుతాయని అన్నారు. అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న పోలీసుల సేవలు, వారి త్యాగాలు అమూల్యమని పేర్కొన్నారు. విపత్తులు, పండుగలు, ఎన్నికలు వంటి అన్ని సందర్భాలలో పోలీసులు ముందుండి సేవలు అందిస్తున్నారని, ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాలను సమర్థవంతంగా ఛేదిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారని కలెక్టర్ తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం
పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నందుకు పోలీసు శాఖ ని అభినందించారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ పోలీసులు ముందంజలో ఉంటారని తెలిపారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ అభివృద్ధికి శాంతి, స్థిరత్వం, సామాజిక సమైక్యత అవసరమని, పోలీసు వ్యవస్థ వాటిని కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తోందని అన్నారు.
Also Read: Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?
