CM Revanth Reddy: యాదవుల సహకారంతోనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిందని, వాళ్ల ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ – ఎన్టీఆర్ స్టేడియంలో యాదవ సోదరులు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ కార్యక్రమంలో (Sadar Festival 2025) ముఖ్యమంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నమ్మిన వారికోసం ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా యాదవులు అండగా నిలబడుతారని, వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని ప్రశంసించారు.
Also Read- Liquor Shop Tender: వైన్ షాపు దరఖాస్తులకు గడువు పెంపు.. ఎందుకంటే?
యాదవుల సహకారంతోనే
యాదవ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని, ఎంతో చరిత్ర కలిగిన సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరినప్పుడు వెంటనే ఆమోదించడమే కాకుండా నిధులు కేటాయించామని గుర్తుచేశారు. యాదవుల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితి తగ్గించాలి
ఈ కార్యక్రమానికి ముందు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు ఈ సందర్భంగా సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు.. అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
