Liquor Shop Tender: వైన్ షాపుల కోసం దరఖాస్తు (Liquor Shop Tender) చేసుకోవటానికి గడువును పెంచుతూ ఎక్సయిజ్ ఉన్నతాధికారులు (Excise Department) నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈనెల 18తో గడువు ముగియగా ఇప్పుడు 23వ తేదీ వరకు దానిని పెంచారు. రాష్ట్రంలోని 2,620 వైన్ షాపుల కోసం ఎక్సయిజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. క్రితంసారి నోటిఫికేషన్ ఇచ్చినపుడు లక్షా 32వేల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి అప్లికేషన్ల సంఖ్య లక్షా 50 వేలు దాట వచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా గడువు ముగిసేనాటికి కేవలం 89,344 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దాంతో అధికారులు సమీక్ష జరిపారు. దీంట్లో క్రితంసారికన్నా దరఖాస్తుతో పాటు చెల్లించాల్సిన నాన్ రిఫండబుల్ ఫీజును లక్ష రూపాయలకు పెంచటం తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు రావటానికి ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌తో బంద్ జరిగిన నేపథ్యంలో బస్సులు తిరగక పోవటం, బ్యాంకులు పని చేయక పోవటం వల్ల కూడా దరఖాస్తులు తక్కువగా వచ్చాయని కొందరు అధికారులు చెప్పారు. ఈ కారణాల వల్ల చివరి రోజు అప్లికేషన్లు ఇవ్వాలనుకున్న వారు వాటిని దాఖలు చేయలేక పోయారని తెలిపారు. ఈ క్రమంలో దరఖాస్తుల గడువును ఈనెల 23వ తేదీ వరకు పెంచుతూ ప్రొహిబిషన్, ఎక్సయిజ్ కమిషనర్ హరికిరణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వైన్ షాపుల కోసం లాటరీ నిర్వహించనున్నారు.
Also Read- Parineeti Chopra: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. ఇక సర్వస్వం వీడే అంటూ..!
మందుకొట్టి దొరికారు
ఇదిలా ఉంటే.. డ్రంకెన్ డ్రైవ్‌కు చెక్ పెట్టటంతోపాటు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో శనివారం రాత్రి సెంట్రల్ జోన్ పరిధిలోని అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్, గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరిపారు. 212 మందిని అదుపులోకి తీసుకుని ఆయా కోర్టుల్లో హాజరు పరిచారు. న్యాయస్థానాలు వీరిలో 187మందికి 3,100 రూపాయల చొప్పున జరిమానాలు విధించాయి. మరో 25 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేశాయి. ఇక, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న మరో 147 మందిని కూడా అరెస్ట్ చేసి కోర్టుల్లో హాజరు పరిచారు. కోర్టులు ఒక్కొక్కరికి 1,100 రూపాయల చొప్పున జరిమానా విధించాయి. వాహనాలు నడుపుతున్న 7గురు మైనర్లను అదుపులోకి తీసుకుని హాజరు పరచగా కోర్టులో 2,100 రూపాయల చొప్పున జరిమానాలు వేశాయి.
Also Read- Bigg Boss Telugu 9: పెళ్లి నీకు, నాకా? నాగ్ చేసిన పనికి ఏడ్చేసిన సంజన!
సైబరాబాద్ పరిధిలో…
ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం జరిపిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో 480 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఇక, ఆటోలు నడుపుతూ 19 మంది, కార్లు డ్రైవ్ చేస్తూ 85 మంది, భారీ వాహనాలు నడుపుతూ 5గురు దొరికారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
