Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ మావోయిస్టు రహిత ప్రాంతాలు
భారీ ఎత్తున నక్సల్స్ లొంగుబాటు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి నుంచి కీలక ప్రకటన
రాయపూర్, స్వేచ్ఛ: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్‌లను మావోయిస్టు రహిత ప్రాంతాలుగా అమిత్ షా ప్రకటించారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాలు ప్రస్తుతం మావోయిస్టు హింసకాండ నుంచి పూర్తిగా విముక్తి పొందాయని, ఇది సంతోషించదగ్గ విషయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణ బస్తర్‌లో అరకొర మావోయిస్టులు మాత్రమే మిగిలారని, వారిని కూడా త్వరలోనే భద్రత బలగాలు నిర్మూలిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
2024 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు. 1,785 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని వివరించారు. చాలామంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఏరివేశాయని అన్నారు. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకున్న సంకల్పానికి ఈ చర్య ప్రతిబింబమని చెప్పారు.
170 మంది నక్సలైట్లు తమ ఆయుధాలను వీడారని చెప్పారు. నక్సలిజంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద విజయం సాధించాయని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది, గురువారం 120 మంది, కాంకేర్‌లో 27 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలేసి స్వచ్ఛందంగా లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో గత మూడు రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనూ దాదా అలియాస్ అభయ్‌తో పాటు మరో 60 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు.
Read Also- Mahabubabad District: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో దందా.. ఆకాశానికెగీసిన ఇటుక ధరలు
గత రెండు రోజుల వ్యవధిలో మొత్తం 250 మంది మావోయిస్టులు హింస మార్గాన్ని వీడారని, ఈ పరిణామం దేశంలో శాంతియుత వాతావరణానికి ప్రత్యేక నిదర్శనంగా నిలిచిందని అమిత్ షా అన్నారు. మావోయిస్టులు భారత రాజ్యాంగంపై నమ్మకంతో తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. నక్సలిజాన్ని తుదకంటూ నిర్మూలించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని, దాని ఫలితమే ఈ లొంగుబాట్లు, నిరాయుదీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటుకు భద్రతా బలగాలు కఠినమైన చర్యలు తీసుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు.
