Success Story: కొందరి జీవిత కథలు.. సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువ కాబోవు. ఎందరికో ఆదర్శంగా (Success Story) నిలుస్తుంటాయి. అలాంటికోవకే చెందుతారు బీహార్ యువ వ్యాపారవేత్త నీరజ్ సింగ్. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా కెరీర్ ప్రారంభించిన ఆయన, నేడు ఏకంగా రూ.400 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి అధిపతిగా వ్యవహారిస్తున్నారు. ఈయన గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. జన సురాజ్ పార్టీ అభ్యర్థిగా షెహర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఆదర్శప్రాయమైన కెరీర్..
నీరజ్ సింగ్ బీహార్‌లోని షెహర్ జిల్లాలోని మధురాపూర్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన 13 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తిచేశారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన కుటుంబానికి అండగా, తనవంతు సాయం చేయాలని భావించారు. కానీ, అప్పటికి పిల్లాడు కావడంతో ఆయనకు ఎలాంటి పని దొరకలేదు. దీంతో, తమ ఊరిలోనే పెట్రోల్, డిజిల్ అమ్మారు. ఆ తర్వాత మరింత ఆదాయం, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఒకచోట సెక్యూరిటీ గార్డుగా చేరారు. ఆ మరుసటి ఏడాది ఢిల్లీ నుంచి పుణెకి మకాం మార్చారు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్‌గా చేరారు. అక్కడ క్రమంగా మంచిపేరు తెచ్చుకొని, చివరకు హెచ్చార్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే స్థాయికి ఎదిగారు. అనంతరం 2010లో నీరజ్ సింగ్ సొంతంగా ధాన్యం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ బిజినెస్ ఆయనకు లాభాల పంట పండించింది.
Read Also- Super GST – Super Savings: మోదీ తెచ్చిన సంస్కరణలు.. దేశానికి గేమ్ ఛేంజర్లు.. సీఎం చంద్రబాబు
ఆయన కష్టానికి తగ్గట్టుగా వ్యాపారం బాగా విస్తరించింది. దీంతో, ఉషా ఇండస్ట్రీస్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువుల తయారు చేస్తోంది. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ రంగంలోకి కూడా నీరజ్ సింగ్ అడుగుపెట్టారు. అంతేనా, ఈ మధ్యే ఆయన ఒక పెట్రోల్ బంక్ కూడా ప్రారంభించారు. బీహార్‌లోని మోతిహార్ కేంద్రంగా ఉషా ఇండస్ట్రీస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కంపెనీ టర్నోవర్ రూ.400 కోట్లు కాగా, సుమారు 2,000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు.
నీరజ్ సింగ్ ప్రయాణ క్రమంలో ఒకప్పుడు ఆయనకు సైకిల్ కూడా ఉండేది కాదు. ఇరుగుపొరుగువారి సైకిళ్లు అడిగి తీసుకుని పనులు చేసుకునేవారు. ఇప్పుడైతే ఆయన వేరు లెవల్‌లో ఉన్నారు. రేంజ్ రోవర్‌తో పాటు అరడజన్‌కు పైగా లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఇక, నీరజ్ సింగ్ భార్య, ఇద్దరు కొడుకులు, అమ్మానాన్నతో కలిసి ఉంటున్నారు. ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. నీరజ్ సింగ్ చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గర్భిణీలు, యువతలకు వివాహాలకు సాయం, వృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు, తీర్థయాత్రల వంటి సేవలు అందిస్తున్నారని అంటున్నారు.
నీరజ్ సింగ్ శుక్రవారం (అక్టోబర్ 17) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసలైన రాజకీయమే ఇక్కడి ప్రజల జీవితాలను మార్చుతుందని, బీహార్ వద్ద అన్నీ ఉన్నాయి, కానీ కావాల్సిన మనోబలమే లేదని జన సురాజ్ పార్టీలో చేరిన రోజు ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన 38 ఏళ్లే కావడంతో, నీరజ్ సింగ్ ప్రయాణం సినిమా కథలా అనిపిస్తోందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో షెహర్ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తే, ఆయన కీర్తి మరింత పెరుగుతుందని అంటున్నారు.
