Super GST – Super Savings: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కర్నూలులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో కూటమి ప్రభుత్వం బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు.
‘మోదీ.. అరుదైన వ్యక్తి’
బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుషాల గడ్డ లో జీఎస్టీ బచత్ ఉత్సవ్ సభకు ప్రధాని హాజరు కావటం సంతోషంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు. ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు. విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్న అరుదైన వ్యక్తి మోదీ. ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి. 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో సూపర్ పవర్ గా తయారవుతుంది’ అని చంద్రబాబు అన్నారు.
కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ https://t.co/lMvFZVOeRc
— Telugu Desam Party (@JaiTDP) October 16, 2025
‘ 81 కోట్ల మందికి ఉచిత రేషన్’
ప్రధాని మోదీ గత 11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. ‘144 వందే భారత్ రైళ్లు, 55 వేల కి.మీ మేర కొత్త హైవేలు, 86 ఎయిర్ పోర్టులు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత ప్రధాని మోదీదే. 7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ప్రధాని మోదీదే ఇది ఆల్ టైం రికార్డు. ప్రధాని సంకల్పంతోనే 11 ఏళ్ల క్రితం 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చింది. 2028 నాటికి 3వ, 2038కి 2వ ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. ఆర్థికంగా మనం బలం ఏంటో ఈ విజయాలు చెబితే.. సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూర్ చాటింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మోదీ.. నిజమైన కర్మయోగి: పవన్
‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రసంగించారు. ‘దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ ఓ నిజమైన కర్మయోగి. ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోంది. జీవిత, ఆరోగ్య భీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతారు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని పవన్ చెప్పుకొచ్చారు.
Also Read: PM Modi – Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని.. నందిని చూస్తూ మోదీ ఏం చేశారంటే?
నారా లోకేష్ ఏమన్నారంటే..
ఐటీ మంత్రి నారా లోకేష్ సైతం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వ పటిమను కొనియాడారు. ‘మూడ్ ఆఫ్ ఇండియా మన నమో.. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా అది విజయం సాధిస్తుంది. 25 ఏళ్లగా గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి ప్రధాని హోదా వరకూ నిరంతరంగా ఉన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ గడగడలాడింది. టారిఫ్ల పేరుతో భయపెడితే ఆత్మనిర్భర్ భారత్ అని వారినే భయపెట్టారు ప్రధాని మోదీ. దేశానికి ప్రజలకు మంచి జరిగితే చాలు వేల కోట్లు నష్టపోయినా పర్వాలేదని జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. పేదల రహిత భారతదేశం సాధించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది. పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి. 16 నెలల్లో రాష్ట్రానికి ప్రధాని 4 మార్లు వచ్చి ఏపీకి ప్రయోజనం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే’ అని లోకేష్ అన్నారు.
