Ear Protection: చెవిలో గులిమి అంటే చాలామంది మొహం అదోలా పెట్టి, “ఛీ, దాన్ని శుభ్రం చేయాలా” అని అనుకుంటారు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో “చెవి గులిమి తీసేస్తాం” అంటూ డబ్బా పట్టుకుని తిరిగే వాళ్ళను చూస్తే, గులిమి అంటే ఏదో హాని చేసే వస్తువని అనిపిస్తుంది. కానీ, నిజం ఏంటంటే, గులిమి మన చెవులకు రక్షణ కవచం లాంటిది అని ఆడియాలజిస్ట్ చెబుతున్నారు.
మన కళ్ళకు కనురెప్పలు రక్షణగా ఉంటాయి. కానీ చెవులు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. చెవి ముందు భాగంలోని వెంట్రుకలు, సెబేషియస్ గ్రంథుల నుంచి వచ్చే స్రావాలు కలిసి గులిమి ఏర్పడుతుంది. ఈ గులిమి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వంటివి చెవి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంటే, గులిమి అనేది చెవికి సహజమైన రక్షణ వ్యవస్థ. ఇది హాని చేసేది కాదు, మనకు ఎంతో మేలు చేస్తుంది.
Toothache Remedies: పంటి నొప్పితో బాధ పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలతో తగ్గించుకోండి!
గులిమి అనేది ఒక సైకిల్‌లో పనిచేస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి ఒకే గులిమి ఉండదు. మొదట తడి రూపంలో ఉండే గులిమి, దుమ్ము, ధూళిని ట్రాప్ చేస్తుంది. కొంత కాలానికి అది గట్టిపడుతుంది, ఆ తర్వాత పొడి పొడిగా మారి దానంతట అదే బయటకు వస్తుంది. మనం చెవిలోంచి తెల్లగా, పొడిగా బయటకు వచ్చే దాన్ని చూస్తూ ఉంటాం కదా, అదే గులిమి చివరి దశ. అంటే, మనం ఏం చేయకుండానే చెవులు సహజంగానే క్లీన్ అవుతాయి. దాన్ని మనం దాని కోసం తీయాల్సిన అవసరం లేదు.
చాలామంది బడ్స్, పిన్నీసులు, అగ్గిపుల్లలు గులిమిని తీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల గులిమిని ఇంకా లోపలికి నెట్టి, చెవి రంధ్రాన్ని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఇది చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి అలా చేయకండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
