Gold Seized: ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో కొందరు అక్రమార్కుల చూపు దానిపై పడింది. కొంచెం కష్టపడి బంగారాన్ని దేశం దాటిస్తే.. ఎంచక్కా కోట్లల్లో లాభం పొందవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి దొంగచాటుగా భారత్ కు తరలిస్తూ.. ఎయిర్ పోర్టులో అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లో భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
రూ.2.3 కోట్ల బంగారం సీజ్..
కువైట్ నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్ దిగి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీ ఎత్తున బంగారాన్ని డీఆర్ఐ (Directorate of Revenue Intelligence – DRI) అధికారులు గుర్తించారు. అతడి నుంచి 1798 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 2 కోట్ల 37 లక్షలు ఉండొచ్చని డీఆర్ఏ అధికారులు తెలిపారు.
Also Read: BJP District Presidents: జిల్లా అధ్యక్షులపై బీజేపీ అసహనం.. వికారాబాద్, రంగారెడ్డి నేతలపై ఫోకస్.. ప్రక్షాళన దిశగా అడుగులు!
బంగారాన్ని ఎలా దాచాడంటే?
నిందితుడు.. బంగారాన్ని 5 బిస్కెట్లు, రెండు కట్ పీసుల రూపంలో తరలించేందుకు యత్నించాడు. ఎయిర్ పోర్ట్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా లగేజీ డోర్ మెటాలిక్ లాక్ లో కొంత బంగారాన్ని దాచాడు. మిగిలిన దానిని పొద్దు తిరుగుడు గింజలు ఉన్న ప్లాస్టిక్ పౌచ్ సంచిలో ఉంచి.. తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే నిందితుడిపై అధికారులకు సందేహం వచ్చి తనిఖీ చేయగా పెద్ద మెుత్తంలో గోల్డ్ బయటపడింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
