BJP District Presidents: అసెంబ్లీ ఎన్నికలంటే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బలం పెరిగిందనే టాక్ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకోని ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గతంలో పనిచేసిన జిల్లా అధ్యక్షులు అధికార పార్టీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో ఉండేది. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులతో పార్టీలో చురుకుతనం లేదనే ప్రచారం బాగా వినిపిస్తుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికార పార్టీని నిలదీయడంలో వెనకబడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై యాక్షన్ ప్లాన్ ఏవిధంగా చేయాలనే ఆలోచన జిల్లా అధ్యక్షులు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అత్యధికంగా అర్భన్ ప్రాంతమున్న రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలపైన జిల్లా అధ్యక్షుడికి పట్టు లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది.
చేవెళ్ల ఎంపీ సైతం ఆరోపణలు..
అధికార పార్టీకి తగ్గట్టుగా ప్రతిపక్ష పాత్ర.. బీజేపీ పార్టీతో పాటు జిల్లా అధ్యక్షులు వ్యవహారించాలి. గతంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బొక్క నర్సింహ్మారెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు అధికార పార్టీ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల్లో ఉండేవారు. నూతన అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత పార్టీ కార్యక్రమాల చేపట్టడం పక్కకు పెడితే అధికార పార్టీ నిర్ణయాలు, హామీల అమలు విషయాల్లో ఇప్పటికి స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుల ఎంపికపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక ఏ ప్రతిపాదికన చేపట్టారో తెలియదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ పాల్ గౌడ్, రాజశేఖర్ రెడ్డిలకు స్థాయికి మంచి బాధ్యతలు అప్పగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం వికారాబాద్ జిల్లా పర్యటనలో అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పై మీడియాపై విమర్శలు చేశారు. వికారాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి అనర్హుడని ఎంపీ విమర్శించారు. పార్టీని ఉన్నతిని అకాంక్షించే వ్యక్తులు అధ్యక్ష స్థానంలో ఉండాలని కోరారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో ఆలస్యం..
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక నిఘా పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టాలని విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుల పనితీరుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 10 జిల్లాల అధ్యక్షుల మార్పులు, చేర్పులు చేయాలని అధిష్టానం యోచిస్తోంది. అందులో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇటీవల కాలంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా అధ్యక్షుల నియామకంపై చేసిన విమర్శలు ప్రచారానికి ఊతమిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు పోకస్ పెట్టాయి. అందులో బీజేపీ కూడా ఉండటంతో జిల్లా అధ్యక్షుల ప్రక్షాళనలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది.
స్థానిక సంస్థలే లక్ష్యంగా..
రంగారెడ్డి జిల్లాలో బీజేపీ గత అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన పోటీనిచ్చింది. మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియేజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నువ్వా నేనా అనే విధంగా రంగంలో తలబడ్డారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా అత్యంత ఆధారణ పోందారు. యాచారం, కందుకూర్ లాంటి మండలాల్లో ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకోగా, తుక్కుగూడ, బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగ్ మున్సిపాలిటీల్లో కూడా తమ సత్తాను చూపించారు. కానీ ఇప్పుడు జరిగబోయే స్ధానిక సంస్థల్లో కూడా బీజేపీ పట్టు కొల్పోయే పరిస్థితి కనిపిస్తోందనే ప్రచారం ఉంది. కార్యకర్తలను ఉత్సహ పరిచే విధంగా జిల్లా అధ్యక్షుల వ్యవహారశైలి ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షల మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణతో అధ్యక్షులను ఎంపిక చేసే ఆలోచనలో అధిష్టానం ఉందని సమాచారం.
Also Read: PM In Kurnool: చంద్రబాబు, పవన్ చాలా పవర్‌ఫుల్.. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది.. ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రక్షాళనకు ముందే రాజీనామా..
మరోవైపు వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజీనామా లేఖను అధిష్టానానికి పంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అధిష్టానం ఒక వైపు ప్రక్షాళన చేపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజీనామా చేయడంతో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా రాజీనామా పత్రాన్ని బీజేపీ అధిష్ఠానికి రాజశేఖర్ రెడ్డి అందజేసినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడి నిర్ణయం పై వేచిచుడాల్సి వస్తుంది. పార్టీ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోవాలని కొంతమంది అధ్యక్షులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాజశేఖర్ రెడ్డి రాజీనామాను అంశాన్ని బీజేపీ అధికారికంగా ధ్రువీకరించకపోవడం గమనార్హం.
