Unexpected Train Birth: గర్భవతులకు పురిటి సమయం ఒక గండం లాంటిదని చెప్పవచ్చు. సమయానికి వైద్య సహాయం అందించడం ఎంతో ముఖ్యం. నొప్పులు మొదలైనప్పటి నుంచి ప్రసవం పూర్తయ్యే వరకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, అనుభవజ్ఞులైన డాక్టర్లు పర్యవేక్షణ ఎంతో సురక్షితం. సరైన వైద్య సహాయం లేకపోతే తల్లి, శిశువుకు ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంటుంది. అందుకే గర్భవతులను డెలివరీ సమయానికి ముందుగానే ఆసుపత్రికి చేర్చడం, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం అత్యంత కీలకం. అంతేకాదు, ఆ సమయంలో గర్భణీలకు కుటుంబ సభ్యులు అందించే మనోధైర్యం కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ ఉన్నా ఒక్కోసారి ఊహించని విషాదాలు జరుగుతుంటాయి. కానీ, అనూహ్య రీతిలో ఓ నిండు గర్భిణీ రైలులో ప్రయాణిస్తుండగా, అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత ఒకింత అద్భుతమే (Unexpected Train Birth) జరిగింది.
సగం బయటకొచ్చిన బేబీ
రైలులో పురిటి నొప్పులు తాళలేకపోతున్న ఆ గర్బిణీ బాధకు చలించిపోయిన ఓ తోటి ప్యాసింజర్ (యువకుడు).. ట్రైన్ దగ్గరిలోని ఓ స్టేషన్‌కు చేరుకున్నాక ఎమర్జెన్సీ చెయిన్ లాగాడు. రైలు ఆగిన వెంటనే ఆమెను ప్లాట్‌పైకి తీసుకెళ్లడంలో సాయం చేశాడు. అప్పటికే తీవ్రమైన నొప్పులు, కడుపులోని శిశువు సగం బయటకు రావడం కూడా జరిగిపోయాయి. దీంతో, తల్లిబిడ్డ ప్రాణాపాయ స్థితిలో నిలిచారు. ఎటూపాలుపోని పరిస్థితి నెలకొనడంతో కుటుంబ సభ్యులతో పాటు స్టేషన్‌లోని సెక్యూరిటీ సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు చాలా టెన్షన్‌కు గురయ్యారు. దగ్గరలో ఎలాంటి వైద్య సదుపాయాలు, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో సదరు యువకుడు.. వైద్యురాలిగా పనిచేస్తున్న తన స్నేహితురాలికి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసి అక్కడి పరిస్థితిని ఆమెకు చూపించాడు. ఆ తర్వాత వైద్యురాలు సూచనలు పాటిస్తూ సురక్షితంగా డెలివరీ చేయడంలో సాయపడ్డాడు.
బుధవారం అర్ధరాత్రి తర్వాత ముంబై రామ్ మందిర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ప్లాట్‌ఫామ్‌పైనే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో యువకుడి సాయం తల్లిబిడ్డలను కాపాడింది. ఈ ఘటనను మ్యూజిక్ డైరక్టర్ మంజీత్ ధిల్లోన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
బిడ్డ తల భాగం బయటకు వచ్చేసి, మిగిలిన శరీరం లోపల ఉండడంతో ప్రాణాపాయ పరిస్థితి నెలకొందని, ఆ సమయంలో దేవుడే తన దూతగా యువకుడిని అక్కడికి పంపించినట్టుగా అనిపించిందని ధిల్లోన్ రాసుకొచ్చారు. ఆ యువకుడి పేరు వికాస్ అని, తన స్నేహితురాలు డాక్టర్ దేవికా దేశ్‌ముఖ్‌కు వీడియో కాల్ చేసి, ఆమె చెప్పిన సూచనలతో జాగ్రత్తగా బిడ్డను ప్రసవింపజేశాడని ఆయన వెల్లడించారు. వికాస్ వల్ల రెండు ప్రాణాలు నిలిచాయని ధిల్లోన్ అన్నారు. చాలా మంది చూశారు కానీ వెళ్లిపోయారని, ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే, అది దేవుని సంకేతంగా భావించి ముందడుగు వేయాలంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సదరు గర్భణీని ఆమె కుటుంబ సభ్యులు ట్రైన్ ఎక్కడానికి ముందే ఓ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటో స్పష్టంగా తెలియరాలేదు గానీ, ట్రైన్‌లో ప్రయాణించాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. కాగా, డెలివరీ తర్వాత తల్లి, బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం.
Read Also- CM Revanth Reddy: సీఎంవో కార్యాలయం నుంచి అధికారుల లీకులతో ఇబ్బందులు.. సీరియస్‌గా తీసుకున్న సీఎం
