Student Suicide: విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్వారా ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిప్లొమో విద్యార్థి.. క్లాస్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దాచేందుకు యత్నించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. డిప్లొమో మెుదటి సంవత్సరం చదువుతున్న ఉదయ్.. బలవన్మరణానికి పాల్పడటం కాలేజీలో తీవ్ర దుమారం రేపింది. పోరుమిళ్లకు చెందిన విజయ్.. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్తగా కాలేజీలో చేరాడు. అయితే అతడ్ని ఓ మహిళా టీచర్ వేధించినట్లు తెలుస్తోంది. అందరి ముందు మందలించడంతో పాటు, కుంగిపోయేలా మాట్లాడి వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయ్.. ఎవరూ లేని సమయంలో క్లాస్ రూమ్ లోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
క్లాస్ మేట్స్ ఆందోళన..
మరోవైపు విజయ్ మరణాన్ని తోటి క్లాస్ మేట్స్, కాలేజీ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. కాలేజీ ఎదుట బైఠాయించి.. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయ్ ఆత్మహత్యను కప్పిపుచ్చేందుకు కాలేజీ యాజమాన్యం ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల నిరసనలకు ఏబీవీపీ నాయకులు మద్దతు తెలియజేశారు. వారు కూడా విద్యార్థులతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటీనా కాలేజీ వద్దకు చేరుకొని పరిస్థితులను చక్కదిద్దారు. విజయ్ అత్మహత్య గల కారణాలను అన్వేషిస్తున్నారు. విజయ్ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.
Also Read: Jubilee Hills Bypoll: కిషన్ రెడ్డి సిగ్గుపడాలి.. ఎంపీగా జూబ్లీహిల్స్‌కు ఏం చేశావ్.. షబ్బీర్ అలీ ఫైర్!
మరో విద్యార్థి సైతం సూసైడ్..
మరోవైపు తిరుపతిలోనూ ఓ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రగిరి మండలం కొంగనవారిపల్లి జడ్పీ హైస్కూల్ కు పదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన బాధిత విద్యార్థి నుంచి.. మద్యం వాసన రావడాన్ని తోటి స్టూడెంట్స్ గమనించారు. దీంతో వారు టీచర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి బ్యాగ్ చెక్ చేయగా పుస్తకాల మధ్యలో మద్యం సీసా కనిపించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ మాస్టర్.. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో భయపడి స్కూలు నుంచి పారిపోయిన బాలుడు.. రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు.
