Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు (Jubilee Hills bypoll nominations) నామినేషన్లు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్ల స్వీకరణకు మొదటి రోజైన ఈ నెల 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు దాఖలు చేయగా, మరుసటి రోజైన 14న 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్ లు దాఖలు చేయగా, మూడో రోజైన బుధవారం 12 మంది అభ్యర్ధులు 13 సెట్లుగా నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 32 మంది అభ్యర్థులు 35 సెట్లుగా నామినేషన్లను సమర్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మూడో రోజు నామినేషన్లు సమర్పించిన వారిలో మాగంటి సునీత
వీరిలో ప్రధాన పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత కూడా షేక్ పేట తహశిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో రెండు సెట్లుగా తన నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాంకు సమర్పించారు. మూడో రోజు నామినేషన్లు సమర్పించిన వారిలో మాగంటి సునీతతో పాటు ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ అర్రోళ్ల, ఆలియన్స్ డెమోక్రాటిక్ రిఫోమ్స్ పార్టీ అభ్యర్థిగా బుద్దయ్య అంభోజు కూడా నామినేషన్లను సమర్పించారు.
22న నామినేషన్ల పరిశీలన
వీరితో పాటు స్వతంత్ర్య అభ్యర్థులుగా సల్మాన్ ఖాన్, చిట్టబోయిన సులోచన రాణి, చలిక పార్వతి, చిట్టబోయిన నటరాజ్, చలిక చంద్రశేఖర్, మహ్మద్ అక్బరుద్దీన్, జమల్ పుర్ మహేశ్ కుమార్, రెహ్మాన్ షరీఫ్, కంటే సాయన్నలు ఒక్కో సెట్ నామినేషన్లను సమర్పించారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నాం మూడు గంటలకు ముగియనుంది. మరుసటి రోజైన 22న నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
సునీత గెలుపు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదని, పదేళ్ల అభివృద్ది, రెండేళ్ల అరాచక పాలన మధ్య జరగనున్న ఎన్నిక అని భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (KTR) అన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాంకు నామినేషన్ సమర్పించారు. అంతకు ముందు భారత రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా ఉప ఎన్నికను అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆడబిడ్డ మాగంటి సునీత గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. సునీత గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నెలకు రూ.2500 చెల్లిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదు
లక్షల మంది రైతన్నలు సునీత గెలుస్తుందని ఆశిస్తున్నారన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగిపోవాలని హైదరాబాద్ నగర పేదలు కూడా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూతపడుతున్న బస్తీ దావఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని, కేసీఆర్ హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని, ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ప్రజాప్రతినిధికి అవకాశమివ్వకుండా దారుణంగా అవమానపడ్డ మైనార్టీలు, ఈ ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారని వివరించారు.
ఈ ఉప ఎన్నిక పునాది కాబోతుంది
తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సైతం సిద్దమైనట్లు కేటీఆర్ వెల్లడించారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని, మా బీఆర్ఎస్ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతుందని, మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతుందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో మా పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతుందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మాగంటి గోపీనాథ్ కృషి ఎంతో ఉంది
జూబ్లీహిల్స్‌లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అని, హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ గెలుపొందిందంటే, అప్పటి జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ కృషి ఎంతో ఉందన్నారు. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆశీర్వదించి, ఆదుకోవాలని మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయించి, ఆయన సతీమణి సునీత గోపీనాథ్ కి మన టికెట్ కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. నామినేషన్ సమర్పించిన సునీతతో పాటు కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యరావు తదితరులున్నారు.
Also Read: Jubilee Hills Voters: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఓటర్ల జాబితా విడుదల.. మెుత్తం ఓటర్లు ఎంతమందంటే?
