Jubilee Hills Bypoll: తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమి ఖాయమని ఆయన అన్నారు. అయితే ఎన్ని ఓట్ల తేడాతో బీజేపీ ఓడబోతోందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ ను గెలిపిస్తారా? అంటూ కిషన్ రెడ్డిని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) మధ్య కుదిరిన ఒప్పందం వల్లే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం తన అభ్యర్థిని నిలపడం లేదా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసిన కిషన్ రెడ్డికి ఏదోక రోజు తన గతే పడుతుందని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతే అధిష్టాన పెద్దలకు ఏం పెట్టుకొని ముఖం చూపిస్తారని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తుందన్న రాజాసింగ్.. మీ గౌరవం ప్రమాదంలో ఉందని స్పష్టం చేశారు.
Also Read: Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే.. ఓటు చోరీ డ్రామాలు ఆడుతున్నాయ్.. మంత్రి పొన్నం మండిపాటు
మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ (Congress)తో పాటు విపక్ష బీఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే బీజేపీ ఇప్పటికీ తన అభ్యర్థిని వెల్లడించలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో చాలా జాగ్రత్తగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి.. టఫ్ ఫైట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు.. విక్రమ్ గౌడ్ పేరును ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
