Toxic Water: దేశంలోని అతిపెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ 1.1 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. అయితే అంతమందికి సరిపడ తాగునీటిని జంట జలాశయాలైన హిమయాత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Usman Sagar) అందిస్తున్నాయి. అయితే ఈ జంట జలాశయాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నీటి నాణ్యత వేగంగా పడిపోతున్నట్లు స్పష్టమైంది. దీంతో నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఉర్దూ యూనివర్శిటీ అధ్యయనం..
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)కి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు. ఒక పరిశోధక విద్యార్థి.. హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలపై అధ్యయనం చేశారు. ఇందులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. భారతీయ ప్రామాణిక సంస్థ (BIS) సూచించిన తాగునీటి ప్రమాణాల ప్రకారం.. ఈ రెండు జలాశయాల నీరు తాగడానికి అనర్హమని తేలింది. ఉస్మాన్ సాగర్ నీటిలో లోహపు నమూనాలు, ఫికల్ కాలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని పరిశోధకలు తెలిపారు. మరోవైపు హిమాయత్ సాగర్ లో సమీప ప్రాంతాల నుంచి వచ్చే మలినజలాలు, పరిశ్రమల వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాల కలుస్తున్నట్లు గుర్తించారు. వీటి కారణంగా గత కొన్నేళ్లుగా రెండు జలాశయాల్లోని నీటి నాణ్యత పడిపోతూ వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
‘తాగడానికి సురక్షితం కాదు’
ఈ అధ్యయనం 2016 – 2022 వరకు సేకరించిన నీటి నమూనాలను విశ్లేషించింది. ఇందులో DO, pH, BOD, నైట్రేట్లు, ఫీకల్ కాలిఫార్మ్స్, క్లోరైడ్లు, సల్ఫేట్లు, టీడీఎస్, సోడియం, కాల్షియం, మ్యాగ్నీషియం, అల్కలినిటీ, హార్డ్నెస్ వంటి వివిధ ప్రమాణాలను పరిశీలించారు. ఈ కాలంలో ఉస్మాన్ సాగర్ నీటి నాణ్యత తీవ్రంగా పతనమైంది. వాటర్ క్వాలిటీ ఇండెక్స్ (WQI) 2016లో 495గా ఉండగా.. 2022లో 77కి పడిపోయింది. కాబట్టి ఈ నీరు తాగడానికి ఏమాత్రం సురక్షితం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
కలుషితానికి కారణాలు
హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు నగరంలోని అనేక ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాయి. అయితే ఈ నీటిలో ఫ్లోరైడ్లు, ఇతర విషపదార్థాలు ఉండటం చాలా ఆందోళనకరమైన విషయమని పరిశోధనలో భాగమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ మస్రూర్ ఫాతిమా అన్నారు. ‘ఉస్మాన్ సాగర్‌కు సమీప నివాస ప్రాంతాల నుండి శుద్ధి చేయని మలినజలాలు వస్తున్నాయి. అలాగే పరిసర పరిశ్రమలు కూడా వ్యర్థాలను చెరువులోకి విడుదల చేస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో పురుగుమందులు, ఎరువులు అధికంగా వాడటం వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది’ అన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ నీటి నాణ్యత తగ్గిందని మస్రూర్ ఫాతిమా తెలిపారు. దాని WQI 2016లో 296 ఉండగా 2022కు వచ్చేసరికి 102కి పడిపోయినట్లు స్పష్టం చేశారు. రైతులు వాడే పురుగుమందులు, రిసార్టులు – కోళ్ల ఫారంల నుండి వచ్చే వ్యర్థాలు చెరువులో కలవడం ఈ పరిస్థితికి కారణమైనట్లు చెప్పారు.
Also Read: Trump On India: భారత్‌పై ట్రంప్ ప్రశంసలు.. ఖంగుతిన్న పాక్ ప్రధాని.. ఏం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరి!
సమస్యకు పరిష్కారాలు..
కాలుష్య కోరల్లో చిక్కుకున్న జంట జలాశయాలను తిరిగి రక్షించుకునే పరిష్కారాలను సైతం పరిశోధకులు తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం, ప్రజల జోక్యం అవసరమని అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వ్యర్థాలు చెరువులో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీటిని ఎలా కాపాడాలి? కాలుష్యం నుంచి ఎలా రక్షించాలి? అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ కోసం.. పరిసర గ్రామాల్లో మలినజల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎరువులు – రసాయనాల వినియోగాన్ని తగ్గించే స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం వంటి చర్యలు అవసరమని సూచించారు. అదనంగా బఫర్ జోన్లు ఏర్పాటు చేయడం, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అనుసరించడం ద్వారా జంట జలాశయాలను కాపాడుకోవచ్చని పరిశోధకులు హితవు పలికారు.
