Hyderabad Crime: ఈ లోకంలో వెలకట్టలేని బంధంగా తల్లి ప్రేమను చెబుతుంటారు. నవ మోసాలు మోసి పెంచిన బిడ్డను.. ఓ తల్లి తన జీవితాంతం కడుపున పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. పిల్లలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా అండగా నిలుస్తుంటుంది. అటువంటి తల్లి.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కవల పిల్లలను దారుణంగా హత్య చేసింది. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన.. నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. కవల పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్ లోని పద్మారావు నగర్ ఫేజ్-1లో నివాసం ఉంటున్న అనిల్, సాయిలక్ష్మీ భార్య భర్తలు. వారికి 4 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ జంటకు కవలలుగా ఆడ, మగ బిడ్డలు జన్మించారు. కుమారుడికి చేతన్, కూతురికి లాస్య అనే పేరు పెట్టుకున్నారు.
బిడ్డలకు అనారోగ్య సమస్యలు..
బిడ్డలు పుట్టకముందు వరకూ ఎంతో సంతోషంగా ఉన్న అనిల్, సాయిలక్ష్మీ జంట.. ఆ తర్వాత నుంచి గొడవలు పడటం ప్రారంభించారు. ఇందుకు కారణం చేతన్ కార్తికేయకు మాటలు రాకపోవడమే. అయితే చేతన్ కు స్పీచ్ థెరపీని సైతం తల్లిదండ్రులు ఇప్పిస్తున్నారు. మరోవైపు కూతురు లాస్య తరుచూ జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుండటంతో అనిల్, సాయిలక్ష్మీల మధ్య గొడవలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
భర్త ఇంట్లో లేని సమయంలో..
పిల్లల విషయంలో తరుచూ భర్తతో గొడవలు జరగడాన్ని సాయిలక్ష్మీ తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయంలో పిల్లలను తన చేతులతో హత్య చేసింది. ఆపై బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ నుంచి అమాంతం కిందకు దూకేసింది. తల్లి, ఇద్దరు బిడ్డలు మృత్యువాత పడటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు రంగంలోకి దిగిన బాలానగర్ పోలీసులు.. భర్త అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
