Economics Nobel: నోబెల్ అవార్డుల్లో చివరి విభాగమైన ఆర్థిక శాస్త్రంలో అవార్డు గ్రహీతల పేర్లు వెల్లడయ్యాయి. 2025 ఏడాదికిగానూ జోయెల్ మోకీర్, ఫిలిప్ అఘియోన్, పీటర్ హోవిట్‌లను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డుకు (Economics Nobel) ఎంపిక చేసినట్టు రాయల్ స్విడిష్ అకాడమీ సోమవారం (అక్టోబర్ 13) ప్రకటించింది. ‘ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధి’ అంశంపై చేసిన విశేష కృషికి ఈ గౌరవాన్ని అందిస్తున్నట్టు వివరించింది. జోయెల్ మోకీర్‌కు ఒక్కరికే నగదు బహుమతిలో సగభాగాన్ని అందిస్తారు. ఆవిష్కరణలు ఆర్థిక పురోగతికి బాటలు వేస్తాయని, స్థిరమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని గుర్తించినందుకుగానూ ఆయన మెజారిటీ భాగాన్ని అందిస్తారు. మిగతా ప్రైజ్ మనీని రెండు భాగాలు చేసి, ఫిలిప్ అఘియోన్, పీటర్ హోవిట్‌లకు పంచుతారు. సృజనాత్మక విధ్వంసం, అంటే కాలం చెల్లిన విధానాల స్థానంలో అధునాతన, సుస్థిర విధానాలను తీసుకురావడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని సిద్ధాంతం ద్వారా చెప్పారు.
కాగా, జోయెల్ మోకీర్‌కు నెదర్లాండ్-ఇజ్రాయెల్-అమెరికా మూలాలు ఉన్నాయి. ఈయన ఆర్థిక చరిత్రకారుడు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. తన పరిశోధనల్లో సాంకేతిక ఆవిష్కరణలు స్థిరంగా కొనసాగాలంటే, పరిజ్ఞానం, ప్రయోగాలు ముఖ్యమని, మార్పులను స్వీకరించే సంస్కృతి ఉండాలని చెప్పారు. యూరప్ పరిశీలనాత్మకంగా పరిణామం చెందినప్పుడే పారిశ్రామిక విప్లవం జరిగిందని ఆయన పరిశోధనలు చెబుతున్నాయి.
శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే?
ఇక, ఫ్రాన్స్‌కు చెందిన ఫిలిప్ అఘియోన్ (యూనివర్సిటీలో పనిచేస్తున్నారు), పీటర్ హోవిట్ (బ్రౌన్ యూనివర్సిటీ) ఇద్దరూ ‘క్రియేటివ్ డిస్ట్రీక్చన్’ అనే సిద్ధాంతం ద్వారా గుర్తింపు పొందారు. పాత టెక్నాలజీలను కొత్త ఆవిష్కరణలు భర్తీ చేస్తే ఆర్థిక వృద్ధి ఏవిధంగా జరుగుతుందో తమ అధ్యయన పేపర్ల ద్వారా నిరూపించారు. ప్రముఖ ఆర్థికవేత్త జోసెఫ్‌ను ప్రేరణగా తీసుకొని ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. అఘియోన్, హోవిట్ ఈ సిద్ధాంతాన్ని గణిత ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. క్రియేటివ్ డిస్ట్రక్చర్ ప్రక్రియలో కొన్ని కంపెనీలు, లేదా ఉత్పత్తులు కనుమరుగు అవుతాయని, కానీ పోటీ పెరిగి ఆవిష్కరణలు కొనసాగుతాయని వివరించారు.
ఎలా ఉపయోగపడుతోంది?
ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తల పరిశోధనలు ఆర్థిక వృద్ధి మూలాలను అర్థం చేసుకోవడంలో ఆర్థికవేత్తలతో పాటు ప్రభుత్వాలకు కూడా ఎంతో సహాయపడుతున్నాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రభుత్వాలు ఆవిష్కరణలను ఏవిధంగా, ఎందుకు ప్రోత్సహించాలి, మార్కెట్లను ఎలా నియంత్రించాలి, పాత పరిశ్రమల అవసరాలను కొత్త అవకాశాలతో ఎలా సమతుల్యం చేసుకోవాలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు దిశానిర్దేశం చేశారని పేర్కొంది. సృజనాత్మక విధ్వంసం (Creative Destruction) భావన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. కృత్రి మేధ, పునరుత్పాదక ఇంధనాలు, జీవ సాంకేతికత వంటి విప్లవాత్మక టెక్నాలజీలు ఆర్థిక వ్యవస్థలను ఏవిధంగా మార్చివేస్తాయో చెప్పడానికి ఈ భావన ఉపయోగపడుతుంది.
