Viral Baby: పిల్లలు మరీ ఎక్కువ బరువుతో జన్మించినా, మరీ తక్కువ బరువు పుట్టినా వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి జననాలు వైద్యరంగం దృష్టిని ఆకర్షించడమే కాదు, సాధారణ జనాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అమెరికాలోని టెనెస్సీ రాష్ట్రంలో తాజాగా అలాంటి జననం ఒకటి (Viral Baby) నమోదయింది. నాష్‌విల్లేకు చెందిన షెల్బీ మార్టిన్ అనే మహిళ ఇటీవల తన తొలి సంతానంలో ఏకంగా 12 పౌండ్ల 14 ఔన్సుల బరువున్న పండంటి మగశిశువుకి జన్మనిచ్చింది. కేజీల పరంగా చూస్తే ఆ బుజ్జివాడు దాదాపుగా 5.8 కేజీల బరువు ఉన్నాడు. దీంతో, షెల్బీ మార్టిన్ ప్రసవం వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాష్‌విల్లేలోని ట్రైస్టార్ సెంటెనియల్ ఉమెన్స్ హాస్పిటల్‌లో షెల్బీకి డెలివరీ అయింది. గత కొన్నేళ్లలో ఈ స్థాయి భారీ బరువుతో తమ హాస్పిటల్‌లో పిల్లలెవరూ పుట్టలేదని, తమ హాస్పిటల్‌లో ఇది రికార్డు స్థాయి జననం అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఈ స్థాయి బరువుతో శిశువు జన్మించడం మనుషుల శరీరాల్లో వైవిధ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా, ప్రసవ సమయాల్లో మహిళల ధైర్యాన్ని, శక్తిసామర్థ్యాన్ని చాటిచెబుతోంది. కాగా, పిల్లాడికి క్యాసియన్ అని పేరు పెట్టారు. కాగా, ఏకంగా 5.8 కేజీల బరువున్న బిడ్డకు షెల్బీ జన్మనివ్వడం సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌గా మారింది. అనేక మంది శిశువు బరువుపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు హాస్యాస్పదంగా స్పందించారు.
షెల్బీ మార్టిన్ తన గర్భధారణ ప్రయాణాన్ని టిక్‌టాక్‌లో షేర్ చేయగా, ఆమె విపరీతంగా పెద్దగా కనిపించే బేబీ బంప్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె వినోదాత్మక వ్యాఖ్యలు, నిజాయితీగా పంచుకున్న అనుభవాలు నెటిజన్లకు మంచి కనెక్షన్‌ను ఇచ్చాయి. “పెద్ద పిల్లల గురించి మాటలుంటే… నన్ను చూసి చెప్పండి!” అంటూ ఆమె చమత్కారంగా మాట్లాడిన ఈ వీడియోకు 4.4 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి, వేలాది కామెంట్లు వచ్చాయి. డెలివరీకి క్రేన్ వాడారా? అంటూ కొందరు కామెంట్లు నవ్వులు పూయించారు.
కాగా, ‘ది న్యూయార్క్ పోస్ట్’ కథనం ప్రకారం, సీ-సెక్షన్ నిర్వహించి షెల్బీకి పురుడు పోశారు. సాధారణంగా అయితే అమెరికాలో జన్మించే సమయంలో పిల్లల బరువు సగటున 7 పౌండ్లకు సమానంగా ఉంటుంది. కానీ, క్యాసియన్ బరువు మాత్రం దాదాపు రెండు రెట్లుగా ఉంది. దీంతో, డెలివరీ పూర్తయిన వెంటనే నిక్యూ (NICU) తరలించి కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఐవీ ఫ్లూయిడ్స్, ఆక్సిజన్ సపోర్ట్, గ్లూకోజ్ లెవల్స్ అన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తన డెలివరీకి సహాయపడిన వైద్య బృందానికి అందరికీ షెల్బీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
