Awareness Video: ‘దొంగలు ఉన్నారు, జాగ్రత్త!’ అంటూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వంటి జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు ఎంత అప్రమత్తం చేసినా జనాలు పెద్దగా పట్టించుకోరు. ఆదమరిచి పెడచెవిన పెడుతుంటారు. ఈ విధంగా నిర్లక్ష్యంతో ఫోన్లు, ల్యాబ్‌టాబ్‌లు, పర్సులు, ఆభరణాలు పోగొట్టుకున్న ప్రయాణికులు ఎందరో ఉన్నారు. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణ సమయాల్లో సెల్‌ఫోన్లు కొట్టేసే దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. అపరిచిత వ్యక్తులు ప్రయాణికుల మాదిరిగా ప్లాట్‌ఫామ్స్ మీద నిలబడి.. అలా ట్రైన్ కదలగానే రైలు విండో సీట్లలో కూర్చున్నవారి చేతుల్లోంచి మొబైల్ ఫోన్లను చోరీ చేసి పరిగెడుతుంటారు. ఈ తరహా దొంగతనాలపై అధికారులు ఎంత అప్రమత్తం చేసినా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే, చాలామంది మాదిరిగానే విండో సీటులో కూర్చొని ఆదమరిచి మొబైల్ ఫోన్ వైపు చూస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలికి ఓ పోలీసు అధికారి చిన్నపాటి ఝలక్ ఇచ్చారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రాజు చౌదరి అనే అధికారి రైలు బయట ఉండి ఒక్కసారిగా మహిళా చేతిలోంచి ఫోన్ లాక్కుతున్నారు. దీంతో, సదరు మహిళా ప్రయాణికురాలు షాక్‌కు గురయింది. ఉలిక్కిపడి చూసింది. పోలీసు అధికారి అని గుర్తించిన వెంటనే ఆమెలో ఆందోళన తగ్గింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, రాజు చౌదరి ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలు (Awareness Video) ప్రమోట్ చేస్తూ ప్రయాణికుల్లో అవగాహన కల్పిస్తుంటారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులతో మాట్లాడుతూ అవగాహన పెంచే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు.
Read Also- Bhatti Vikramarka:హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాజు చౌదరి సందేశం ఇదే..
తాజాగా వైరల్ అయిన ఈ వీడియోలో స్లీపర్ క్లాస్ కోచ్‌లో కిటికీ పక్కన కూర్చున్న మహిళ ఫ్యాసింజర్‌కు భయం పుట్టేలా అవగాహన కల్పించారు. ఫోన్ ఎలా పోయిందో, ఎటు పోయిందో అర్థం కాక ఆమె కాసేపు షాక్‌కు గురయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసిన అధికారి రాజుచౌదరి ‘మహిళా ప్యాసింజర్ నిర్లక్ష్యంగా ఉండకుండా ఒక పాఠం చెప్పాను. భద్రత నిమిత్తం బలగాలు ఉన్నప్పటికీ, అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే సమస్యలను నివారించగలం’’ అని ఆయన రాసుకొచ్చారు.
Read Also- Inspirational Story: సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసి.. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు
అప్రమత్తత ముఖ్యం
అవగాహన కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటికే సుమారుగా మూడున్నర మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది లైక్స్ కొట్టారు. వందలాది కామెంట్లు చేశారు. అధికారి రాజు చౌదరిని చాలామంది ప్రశంసించారు. ఓ యూజర్ స్పందిస్తూ, ప్యాసింజర్లకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని, ఇలాంటి అధికారిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ మెచ్చుకున్నారు. ఇలాంటి అధికారులు చాలా అరుదుగా కనిపిస్తుంటారని మరొకరు మెచ్చుకున్నారు. నిజంగానే, రైలు ప్లాట్‌ఫారంపై ఉన్నప్పుడు మొబైల్ వాడకూడదని, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఓ యూజర్ రాసుకొచ్చారు.
