Inspirational Story: కొందరి జీవిత కథలు అసాధారణంగా అనిపిస్తాయి. ఎంతోమందికి స్ఫూర్తిగా, ప్రేరణగా (Inspirational Story) నిలుస్తుంటాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబ్దుల్ అలీమ్ అనే యువకుడు ఈ కోవకే చెందుతాడు. కొన్ని సంవత్సరాల క్రితం సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘జోహా’ (Zoho) ఆఫీస్ బిల్డింగ్ వెలుపల ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అలీమ్.. ప్రస్తుతం అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా మంచి జీతంతో జాబ్ చేస్తున్నాడు. నలుగురికి ప్రేరణాత్మకంగా ఉన్న తన జీవిత ప్రయాణాన్ని ‘లింక్డ్‌ఇన్’ వేదికగా అలీమ్ పంచుకున్నాడు. డిగ్రీ కూడా చదవకపోయినప్పటికీ, ఎంతో అంకితభావంతో సొంతంగా నేర్చుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్థానానికి ఎదిగానని వివరించాడు.
చేతిలో వెయ్యితో ఊరు నుంచి పయనం..
అలీమ్ చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు. 2013లో చేతిలో కేవలం రూ.1000లతో తన ఊరు నుంచి బయలుదేరానని చెప్పాడు. తీసుకొచ్చిన వెయ్యిలో రూ.800 ట్రైన్ టికెట్‌కి ఖర్చయ్యాయని, చేతిలో పనిలేకపోవడం, ఎక్కడికీ వెళ్లే దారిలేకపోవడంతో దాదాపు రెండు నెలలపాటు రోడ్డుపైనే ఉండాల్సి వచ్చిందని వివరించాడు. ఆ తర్వాత జోహో ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అవకాశం దక్కిందని చెప్పాడు.
Read Also- Nobel Peace Prize: అందుకే ఇవ్వలేదు.. ట్రంప్‌కి నోబెల్ అవార్డ్ రాకపోవడంపై వైట్‌హౌస్ స్పందన
అంతా ఆయన చలవ!
ఒకసారి తాను 12 గంటల షిఫ్ట్ చేస్తున్నపుడు, జోహో ఉద్యోగి అయిన శిబు అలెక్సిస్ అనే సీనియర్ ఉద్యోగి తనతో మాట్లాడారని అలీమ్ చెప్పాడు. పేరు అడిగి, తెలుకున్నాక తన కళ్లలో ఏదో ప్రత్యేకత కనిపిస్తోందంటూ మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నాడు. కానీ, తాను పదవ తరగతి వరకే చదువుకున్నానని, హెచ్‌టీఎంఎల్‌పై కాస్త అవగాహన ఉందని, ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి మాత్రం చాలా ఎక్కువగా ఉండేదని చెప్పారు. తనలోని ఆసక్తిని గుర్తించిన శిబు అలెక్సిస్, తనకు మార్గనిర్దేశనం చేశారని అలీమ్ చెప్పాడు. ఆ తర్వాత 8 నెలల పాటు డే టైమ్ డ్యూటీలు వేయించుకొని, రాత్రిపూట కోడింగ్ నేర్చుకుంటూ గడిపానని తెలిపాడు. చివరికి, తాను ఒక యూజర్ ఇన్‌పుట్‌ను విజువలైజ్ చేసే చిన్న యాప్‌ను డెవలప్ చేశానని, ఆ యాప్‌ను అలెక్సిస్ స్వయంగా ఒక జోహో మేనేజర్‌కి చూపించారని, అప్పుడు వచ్చిన అవకాశం, తన జీవితాన్నే మలుపుతిప్పిందని పేర్కొన్నాడు.
Read Also- Bigg Boss Telugu Promo: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్.. కనుక్కోండి చూద్దాం.. ప్రోమో మామూల్గా లేదుగా!
నాలెడ్జ్ చూసి ఇంటర్వ్యూ కాల్…
అలీమ్ నాలెడ్జ్‌ని గుర్తించిన జోహో మేనేజర్.. ఇంటర్వ్యూ రావాలంటూ పిలిచారు. డిగ్రీ లేకపోవడంతో తొలుత సంకోచంగా భావించానని, అయితే, జోహోలో డిగ్రీ అవసరం లేదని, నైపుణ్యాలు మాత్రమే చూస్తామని చెప్పారని, ఇంటర్వ్యూలో పాసయ్యి డెవలపర్‌గా చేరానని వివరించాడు. ప్రస్తుతం, ఎనిమిదేళ్ల తర్వాత కూడా అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు అలీమ్ పేర్కొన్నాడు. తనకు మెంటార్‌గా వ్యవహరించిన శిబు అలెక్సిస్, అవకాశం ఇచ్చిన కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాడు. తన విలువ నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానని చెప్పాడు. నేర్చుకునే విషయంలో ఆలస్యం జరిగిపోయిందని ఎప్పుడూ భావించవద్దంటూ అలీమ్ తన సందేశాన్ని ఇచ్చాడు. అయితే, అలీమ్ ఏ నగరంలోని జోహో ఆఫీస్‌లో పనిచేస్తున్న విషయాన్ని మాత్రం అలీమ్ వెల్లడించలేదు.
