Nobel Peace Prize: చాలా యుద్ధాలు ఆపాను, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాను, నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) తనకు కాకపోతే మరెవరికి దక్కుతుందనేలా అత్యాశపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడో పేరుని 2025 శాంతి బహుమతికి నోబెల్ కమిటీ ఖరారు చేసింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కులు, శాంతి కోసం పోరాడిన ఆమె కృషికి గుర్తింపుగా కమిటీ ఎంపిక చేసింది. అయితే, నోబెల్ కమిటీ శుక్రవారం చేసిన ఈ ప్రకటన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్ర విచారానికి గురిచేసి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ (White House) తొలిసారి స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ కమిటీ విస్మరించిందని, రాజకీయ ప్రేరేపిత నిర్ణయం తీసుకుందని శ్వేతసౌధం ఆరోపించింది. ‘‘శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి నిరూపితమైంది’’ అని వైట్‌హౌస్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ స్టీవెన్ చెంగ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచ శాంతి పట్ల నిబద్ధతకు కట్టుబడి ఉండాల్సిన కమిటీ వివక్షపూరితంగా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక మీదట కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతి ఒప్పందాలు కుదర్చడాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. యుద్ధాలకు ముగింపు పలికి, ప్రాణాలను కాపాడుతారు. ఆయనకు దయార్థ హృదయం ఉంది. ఆయనలాంటివారు అసలు ఎవరూ ఉండరు. బలమైన సంకల్పంతో ఆయన శిఖరమంతా స్థాయికి ఎదగగలరు’’ అని స్టీవెన్ చెంగ్ చెప్పారు.
ఒబామాపై ట్రంప్ విమర్శలు
నోబెల్ శాంతి అవార్డ్ ప్రకటనకు కొన్ని గంటల ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ అవార్డు దక్కించుకున్నాడని, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం తప్ప ఏ పనీ చేయలేదని అన్నారు. అమెరికాను నాశనం చేసినందుకు బహుమతి ఇచ్చారంటూ ఎటకారం చేశారు. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అధ్యక్ష పదవిని చేపట్టిన 8 నెలల తర్వాత ఈ అవార్డ్ దక్కింది. అంతర్జాతీయ దౌత్యానికి, ప్రజల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో అసాధారణ కృషికి గుర్తింపుగా పురస్కారం అందిస్తున్నట్టు అప్పట్లో కమిటీ తెలిపింది.
Read Also- Asteroid Impact: 24 గంటల్లో భూమి అంతమయ్యి అందరం చనిపోతామని తెలిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
నలుగురు అమెరికా అధ్యక్షులకు అవార్డ్
అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారిలో మొత్తం నలుగురికి నోబెల్ శాంతి బహుమతులు దక్కాయి. థియోడోర్ రూస్ట్ మధ్యవర్తిత్వం వహించి రష్యా-జపాన్ యుద్ధాన్ని ఆపినందుకుగానూ 1906లో ఈ పురస్కారం లభించింది. లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించినందుకు 1919లో ఉడ్‌రో విల్సన్‌కు, మానవ హక్కులు, శాంతి కోసం పాటుపడిన జిమ్మీ కార్టర్‌కు 2002లో, అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం కోసం కృషి చేసిన బరాక్ ఒబామాకు 2009లో ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కింది.
