Sabarimala Gold Controversy: ‘‘అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః’’ అంటూ ధర్మానికి ప్రతిరూపమై, భక్తకోటి కోర్కెలు తీర్చే ఆ అయ్యప్పస్వామివారి శబరిమల ఆలయంలో పెద్దఎత్తున సిరిసంపదలు ఉన్నాయి. నగలు, వస్తువుల రూపంలో బంగారం పెద్ద మొత్తంలో ఉంది. అయితే, ఆలయ కేంద్రంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంత బంగారం లెక్కలోకి రాకుండా ఎవరో కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణతో వివాదం (Sabarimala Gold Controversy) రాజుకుంది. దీనిపై కేరళ హైకోర్టు కూడా రంగంలోకి దిగింది. ఇంతకీ శబరిమలకొండపై అసలు వివాదం ఏమిటి?, ఎంత బంగారం లెక్కలోకి రావడం లేదు?, దీని వెనుక ఎవరు ఉన్నారు?, ఎవరిపై అనుమానాలు ఉన్నాయి?, వంటి సమగ్ర వివరాలతో ప్రత్యేక కథనం…
సెప్టెంబర్ 10న ఏం జరిగింది?
తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, శబరిమల కొండపై అయ్యప్పస్వామివారి గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారాలు, పీఠాలకు సంబంధించిన బంగారు తాపడాలను విడిభాగాలుగా తొలగించి, మరమ్మతు పనుల కోసం పంపించారంటూ దేవస్థానం బోర్డు ప్రత్యేక కమిషనర్ 2025 సెప్టెంబర్ 10న కేరళ హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. రిపేర్ పనుల కోసం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ వద్దకు పంపించాలనుకున్నారని, సెప్టెంబర్ 7న తాపడాలను తొలగించారంటూ తన రిపోర్టులో ఆయన వివరించారు. ప్రత్యేక కమిషనర్ అన్ని వివరాలను నివేదికలో పొందుపరచడంతో 2019లో చోటుచేసుకున్న అనుమానాస్పద వ్యవహారం ఒకటి బయటపడింది.
వివాదానికి మూలం ఈ రెండు అంశాలే!
2019లో ఇవే బంగారు తాపడాలను రిపేర్ పనుల కోసం చెన్నైకి చెందిన ఇదే కంపెనీకి అప్పగించారు. అయితే, రిపేర్‌కు ఇచ్చినప్పుడు, పూర్తయ్యాక ఆలయానికి తిరిగి తీసుకొచ్చిన తర్వాత బంగారు తాపడాల బరువులో వ్యత్యాసం కనిపించింది. రెండో పాయింట్ ఏంటంటే, బంగారు తాపడాల కోసం 1.5 కేజీల గోల్డ్‌ను ఉపయోగించినట్టు 1999లో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) రికార్డుల్లో చాలా స్పష్టంగా లిఖించారు. కానీ, 2019లో రిపేర్‌కు ఇచ్చిన సమయంలో అవన్నీ కేవలం ‘తామ్రఫలకాల’తో (రాగి ప్లేట్లు) తయారు చేసినవేనని పేర్కొన్నారు. ఈ విషయాలను పరిశీలించిన కేరళ హైకోర్టు వెంటనే వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ మొదలుపెట్టింది. సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ అక్టోబర్ 6న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఆలయంలో ఉన్న ప్రతిఒక్క విలువైన వస్తువును జాగ్రత్తగా పరిశీలించేందుకుగానూ కేటీ శంకరన్ అనే మాజీ జడ్జిని కూడా నియమించింది. ఆయనకు ఒక ప్రొఫెషనల్ కూడా సాయం అందించాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also- TG Liquor Tenders 2025: రంగారెడ్డి డివిజన్‌లో కొత్తగా 19 వైన్స్‌లు.. మందకొడిగా టెండర్లు?
ఈ ప్రశ్నలకు సమాధానం లేదు!
బంగారు తాపడాలతో తయారు చేసిన వాటిని రాగితో తయారు చేసినట్టుగా రికార్డుల్లో పొందుపరచడం వెనుక మతలబు ఏమిటి? అనేది ఇప్పుడు పెద్ద అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం, శబరిమల ఆలయం, విగ్రహలు, ఇతర ఏదైనా వస్తువులకు సంబంధించిన మరమ్మతుల అవసరం ఉంటే శబరిమల కొండపైనే చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఇందుకు విరుద్ధంగా ఎక్కడో చెన్నైలో ఉన్న ప్రైవేటు కంపెనీకి ఎందుకు పంపించారు?, ఎంతో విలువైన వస్తువులను ఒక ‘స్పాన్సర్’కి (ప్రైవేటు వ్యక్తి) అప్పగించడం వెనుక దాగివున్న కుట్ర ఏమిటి?, అసలు దేవుడికి సమర్పించిన నగలు, ఆభరణాలకు సరైన డాక్యుమెంటేషన్ వ్యవస్థ ఇప్పటికీ లేకపోవడం ఏమిటి? వంటి సమాధానంలేని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై కేరళ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గత వారం రోజులుగా జరుగుతున్న వ్యవహారాల ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దేవుడి నగల విషయంలో స్పాన్సర్ల ప్రమేయం నేపథ్యంలో శబరిమలలో విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిపేర్లు బూటకం!.. ఎవరీ ఉన్నికృష్ణన్?
2019లో బంగారు తాపడాల రిపేర్ పనులను తానే చేయిస్తానంటూ ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈయన కేరళకు చెందిన వ్యక్తే, కానీ బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. ఒకప్పుడు పూజారి అయిన ఉన్నికృష్ణన్ ఆ తర్వాత వ్యాపారవేత్తగా ఎదిగారు. రిపేర్ పనుల కోసం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ‘స్మార్ట్ క్రియేషన్స్’కు పంపుతానని చెప్పిన వ్యక్తి ఈ ఉన్నికృష్ణనే. ఈయన చర్యలన్నీ ప్రస్తుతం అనుమానాస్పదంగా మారాయి. దేవస్థానం నిబంధనల ప్రకారం సన్నిధానంలోనే మరమ్మతులు జరగాల్సి ఉన్నా ఉల్లంఘనకు పాల్పడ్డారు. పైగా, రిపేర్లు పూర్తయిన తర్వాత నేరుగా ఆలయానికి తీసుకెళ్ల, తిరుమల సహా దక్షిణభారతదేశంలోని పలు ఆలయాలకు తిప్పారు. అంతేకాదు, కేరళకు చెందిన ఓ ప్రముఖ ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Also- Diwali movie releases: దీపావళికి థియేటర్లలో పేలనున్న ధమాకా సినిమాలు.. ఏంటంటే?
నిజానికి, 2019లో ఉన్నికృష్ణన్ చేయించిన మరమ్మతు పలకలను అప్పగించిన సమయంలో కోర్టు కూడా పరిశీలించింది. కానీ, వాస్తవాన్ని గుర్తించకుండా రాగి పలకలు’గా పేర్కొంటూ కోర్టు రిపోర్టులో రాశారు. అన్నింటి బరువు 42.8 కేజీలు అని నమోదు చేశారు. అన్ని రాగితో తయారు చేసినవేనని పేర్కొన్నారు. కానీ, 1.5 కేజీల బంగారాన్ని తాపడం కోసం ఉపయోగించారనే మాటను ఎక్కడా పేర్కొనలేదు. దీంతో, బంగారం దొంగతనం కోసం తాపడాల స్వరూపాన్నే మార్చివేశారని, తీసుకెళ్లేటప్పుడు బంగారు తాపడాలను తీసుకెళ్లి, రాగి తాపడాలను తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేళ్లన్నీ ఉన్నికృష్ణన్ వైపు చూపుతున్నాయి. అయితే, సిట్ సమగ్ర విచారణలో దీని వెనుక ఎవరెవరు ఉన్నారు?, అంతర్గతంగా ఏం జరిగింది? అనే విషయాలు బయటపడనున్నాయి.
