TG Liquor Tenders 2025: రాష్ట్రంలో 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలానికి వైన్ షాపుల లైసెన్స్‌ల కోసం ప్రభుత్వం జారీ చేసిన టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. సెప్టెంబర్ 26న టెండర్లు ప్రారంభమైనా, దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగుస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాలేదు. ఉమ్మడి రంగారెడ్డి డివిజన్ పరిధిలో మొత్తం 514 మద్యం షాపులకు గాను ఇప్పటివరకు కేవలం 742 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ డివిజన్ పరిధిలోని ఏకంగా 294 మద్యం షాపులకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు.
ఘోరంగా టెండర్ల దాఖలు
వైన్ షాపుల టెండర్ల దాఖలులో వికారాబాద్ జిల్లా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జిల్లాలో ఉన్న 59 మద్యం షాపులకు గాను కేవలం ఆరు టెండర్లు మాత్రమే వచ్చాయి. ఈ ఆరు టెండర్లు కూడా కేవలం నాలుగు షాపులకు మాత్రమే రాగా, మిగిలిన 55 షాపులకు ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. సరూర్ నగర్ సర్కిల్‌లో 138 షాపులకు 128 టెండర్లు రాగా, 81 షాపులకు ఒక్క టెండర్ పడలేదు. మేడ్చల్ సర్కిల్‌లో 118 షాపులకు 94 టెండర్లు మాత్రమే వచ్చాయి. 75 షాపులకు టెండర్లు దాఖలు కాలేదు. ఇక మల్కాజిగిరి సర్కిల్‌లో 88 షాపులకు 220 టెండర్లు వచ్చినా, 38 షాపులకు దరఖాస్తు నమోదు కాలేదు.
Also Read: Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘SSMB29’ టైటిల్ ఇదేనా!..
19 కొత్త షాపులు
ప్రస్తుతం కొనసాగుతున్న 495 షాపులతో పోలిస్తే, 2025–27 కాలానికి ప్రభుత్వం రంగారెడ్డి డివిజన్‌లో కొత్తగా 19 వైన్ షాపులను పెంచింది. ముఖ్యంగా శంషాబాద్, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో షాపుల సంఖ్య పెరిగింది. అత్యధికంగా శంషాబాద్ సర్కిల్‌లోనే ఏకంగా 11 కొత్త షాపులను పెంచి టెండర్లను ఆహ్వానించారు. మేడ్చల్ సర్కిల్‌లోని ఒక స్టేషన్‌లో మాత్రం షాపులను తగ్గించారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 18వ తేదీ చివరి రోజు కావడం, ప్రస్తుతం దరఖాస్తులు మందకొడిగా ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, చివరి వారం రోజుల్లో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపులకు దాఖలైన టెండర్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు.
Also Read: Ananya Nagalla: ప్రేమలో అనన్య నాగళ్ల.. ఏకంగా లాంగ్‌టెర్మ్ రిలేషన్‌షిప్ అంట, ఎవరితోనంటే?
