Nobel Peace Prize 2025: మరికొద్ది గంటల్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. నార్వే రాజధాని ఒస్లాలోని నోబెల్ ఇన్ స్టిట్యూట్ (Norwegian Nobel Institute)లో మధ్యాహ్నం ప్రకటన వెలువడనుంది. నోబెల్ కమిటీ ఛైర్మన్ జార్గెన్ వాట్లర్.. స్వయంగా విజేతను ప్రకటించనున్నారు. అయితే ఈసారి నోబెల్ బహుమతిపై ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. పీస్ ప్రైజ్ రేసులో ఉండటమే. నోబెల్ బహుమతిపై తనకున్న ఆశను ఐరాస సాధారణ సభ సహా వివిధ అంతర్జాతీయ వేదికలపై ట్రంప్ 10 సార్లు వెల్లబుచ్చారు. తాను 6-7 యుద్ధాలు ఆపానని.. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడానని చెప్పుకొచ్చారు. మరి ట్రంప్ కు నోబెల్ శాంతి వస్తుందా? ఇందుకు గల అవకాశాలు, ప్రతిబంధకాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
నోబెల్ అవకాశాలపై ట్రంప్ స్పందన
వైట్ హౌస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి గురించి స్పందించారు. ‘మేము ఏడు యుద్ధాలను ఆపేశాం. 8వ దాన్ని కూడా ముగించబోతున్నాం. రష్యా సమస్య కూడా పరిష్కార దశలో ఉంది. చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇన్ని యుద్ధాలు ఆపలేదు. అయినా నాకోసం ఏదోక కారణం కనుగొని బహుమతి ఇవ్వకపోవచ్చు’ అని అన్నారు. దీన్ని బట్టి తనకు ఎలాగో శాంతి బహుమతి రాదని అధ్యక్షుడు ట్రంప్ ఓ క్లారిటీకి వచ్చేసినట్లు అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ బలమైన కారణమే ఉంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ కు జనవరి 31తోనే గడువు ముగిసింది. ఆ లోపు ట్రంప్ కు సంబంధించి ఎలాంటి నామినేషన్ దాఖలు లేదు. కాబట్టి ఈ ఏడాది శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీ ట్రంప్ ను పరిగణలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. కాగా, నోబెల్ శాంతి బహుమతి విజేతకు ఈ ఏడాది డిసెంబర్ 10న ఒస్లోలో ప్రైజ్ ను అందజేస్తారు.
ట్రంప్ నిజంగానే యుద్ధాలను ఆపారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను 7 యుద్ధాలను ఆపానంటూ పదే పదే చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి అందులో నాలుగు మాత్రమే నిజమైన సైనిక ఘర్షణలు. ఇజ్రాయెల్ – ఇరాన్, భారత్ – పాక్, ఆర్మేనియా – అజర్ బైజాన్, రువాండా కాంగో మధ్య ఉద్రిక్తతలు మాత్రమే పరసర్ప దాడులకు దారి తీశాయి. కానీ ట్రంప్ చెప్పుకుంటున్న ఈజిప్ట్ – ఇథియోపియా (నైలు నది వివాదం), సెర్బియా – కోసోవో (సాధారణ ఉద్రిక్తతలు) మధ్య అసలు సైనిక ఘర్షణలే తలెత్తలేదు. పైగా పాక్ పై ఘర్షణలను తానే ఆపానంటూ చెప్పుకుంటున్న ట్రంప్ ప్రకటలను భారత్ బహిరంగంగానే ఖండించింది. అయినప్పటికీ గతంలో నోబెల్ శాంతి గెలుచుకున్న అమెరికా అధ్యక్షులు ఉడ్రో విల్సన్, థియోడోర్ రూస్ వెల్డ్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా జాబితాలో తాను చేరాలని ఆరాటపడటం విడ్డూరంగా ఉంది.
ఒబామాకు రావడం వివాదాస్పదం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ముస్లిం దేశాలతో శాంతి పూర్వక ఒప్పందాలు కుదుర్చుకున్న కారణంగా ఆయన్ను శాంతి బహుమతికి ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత కూడా ఇరాక్, ఉఫ్గానిస్తాన్ యుద్ధాల్లో అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరేలా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా తన అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు నోబెల్ ఇచ్చారని 8 యుద్ధాలు ఆపినా తనకు వస్తుందో రాదో తెలియడం లేదని వాపోయారు. అయితే ట్రంప్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఈ శతాబ్దంలో కొత్త యుద్ధం ప్రారంభించని ఏకైక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కావడం విశేషం. కానీ ట్రంప్ పాలనలో డ్రోన్ దాడులు మాత్రం విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. 2020లో ఇరాన్ జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
Also Read: Prabhas leaked video: ‘ది రాజాసాబ్’ నుంచి వీడియో వైరల్.. ఇక లాఫింగ్ జాతరే..
ట్రంప్ 2.0.. శాంతి దూత
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ప్రపంచ యుద్ధాలకు ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రష్యా – ఉక్రెయిన్, ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణలకు స్వస్థి చెబుతానని ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు. ఆ దిశగా ట్రంప్ కొన్ని చర్యలు సైతం తీసుకోవడం గమనార్హం. ఇటీవల పుతిన్ తో నేరుగా భేటి అయిన ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని కోరారు. అయితే ఆ తర్వాత కూడా ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడటం గమనార్హం. ఇప్పుడు ట్రంప్ ఆశలన్నీ ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందంపై నిలిచాయి. శాంతి బహుమతి ప్రకటనకు 24 గంటల ముందు, గురువారం ఆయన “రెండు పక్షాలు తొలి దశ శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. బందీల విడుదల త్వరలోనే జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు. మెుత్తంగా ఈ ఏడాదికి ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి రాకపోయినా.. వచ్చే ఏడాదికి మరోమారు అవకాశం ఉండొచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
