Government Land: మణికొండ మున్సిపాలిటీలోని పుప్పల్గూడ రెవెన్యూ పరిధిలో అక్రమంగా కబ్జాకు గురైన రూ.6 కోట్లకుపైగా విలువ చేసే 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని (Government Land) రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో అక్రమ గుడిసెలను కూల్చివేసి, స్థలానికి ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసే పనిలో ఉండే కొందరు రాజకీయ, రియల్వ్యాపారులు ఈ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.గతంలోనూ విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, అదే పద్ధతిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ స్థలాలను కాజేసేందుకు అక్రమణదారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Ponnam Prabhakar: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అస్తవ్యస్తం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
పేదలు గూడు కోసం గుడిసెలు వేసుకుంటున్నారని ప్రచారం
ఈ కబ్జాదారులు మొదట పేదలు గూడు కోసం గుడిసెలు వేసుకుంటున్నారని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత అసైన్డ్దారులను ఆసరా చేసుకొని అగ్రిమెంట్లు చేసుకుంటూ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే గండిపేట్మండలం పుప్పల్గూడ పరిధిలోని 600 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. వారం రోజుల క్రితం గుడిసెలు వేసిన వారికి అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం బలవంతంగా ఆక్రమణలను తొలగించారు. ఈ విలువైన భూములను కాపాడి, భవిష్యత్తులో ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నట్లు సమాచారం.
Also Read: Harish Rao: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ
