Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) నేపథ్యంలో ఎన్నికల అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్ జారీకి రోజు ముందు నుంచే జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వివిధ పార్టీలు, వ్యక్తులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. సాయంత్రం వరకు అధికారులు మొత్తం 1,620 రాజకీయ పార్టీల పోస్టర్లు, వాల్ రైటింగ్, బ్యానర్లను గుర్తించారు. వీటిలో 1,097 ప్రభుత్వ ఆస్తులపై, 523 వ్యక్తిగత ఆస్తులపై ఏర్పాటు చేసినట్లు గుర్తించి, అనుమతులు లేని ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లను పూర్తిగా తొలగించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ప్రారంభించారు.
Also Read: Raghunandan Rao: ఎంఐఎం జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయట్లేదు?.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
రౌండ్ ది క్లాక్..
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎంసీఎంసీ ఉల్లంఘనలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1950 ఎలక్షన్ హెల్ప్‌లైన్, సీ-విజిల్ మొబైల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను రౌండ్ ది క్లాక్ పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు పటిష్టంగా పని చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రచారం చేయాలని కర్ణన్ సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించినా, ఎంసీఎంసీ అనుమతి తప్పకుండా తీసుకోవాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.
అనుమతి తప్పనిసరి..
ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ఈ- పేపర్, రేడియో వంటి ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రకటనలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు ప్రచార ప్రకటనల కోసం ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ప్రకటనల కోసం ముందే దరఖాస్తు చేసుకుంటే, సకాలంలో అనుమతులు మంజూరు చేస్తామని కర్ణన్ తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్‌లు కూడా కరపత్రాలు ముద్రించేటప్పుడు పబ్లిషర్ పేరు, అడ్రస్, హ్యాండ్ బిల్లు ఇతర పత్రాలపై తప్పనిసరిగా ముద్రించాలని, ఈ నిబంధనను పాటించి కోడ్ సక్రమంగా అమలయ్యేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల బృందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉపఎన్నికలను నిర్వహించేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.
Also Read: Huzurabad: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు.. పెండింగ్ బిల్లులతో తల్లిదండ్రుల ఆందోళన
