Heavy Traffic Jam: దేశంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ బీహార్ లో ఏర్పడింది. దిల్లీ – కోల్‌కతా జాతీయ రహదారిపై (NH-19) వందలాది వాహనాలు ట్రాఫిక్ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. అయితే గంట గంటకు ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుకుంటామో తెలియక సతమతమవుతున్నారు. దాదాపు 4 రోజులుగా ట్రాఫిక్ లోనే ఉండిపోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్‌కు కారణమేంటంటే?
గత శుక్రవారం బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో దిల్లీ – కోల్‌కతా జాతీయ రహదారిపై పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. డైవర్షన్లు పూర్తిగా నీటమునిగాయి. దీనికి తోడు వరద ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల రోడ్డు దెబ్బతిని.. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు చాలా నెమ్మదిగా కుదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ అంతకంతకు పెరుగుతున్నట్లు సమాచారం.
रोहतास, बिहार
दिल्ली-कोलकाता हाईवे पर बीते 4 दिनों से लंबा जाम, NH पर 40KM तक फैला जाम
बीते चार दिनों से लगा जाम रोहतास जिले से लेकर औरंगाबाद जिले तक पहुंचा, 24 घंटे में गाड़ीयां 5km रास्ता तय कर पा रही है…@yadavtejashwi @NitishKumar #Bihar #Rohtas #Video pic.twitter.com/NpNG3CL2co
— Gaurav Kumar (@gaurav1307kumar) October 8, 2025
65 కి.మీ మేర ట్రాఫిక్
ట్రాఫిక్ జామ్ ప్రస్తుతం రోహ్తాస్ జిల్లా దాటి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. అయితే స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, పాలనా యంత్రాంగం ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు ఈ భారీ ట్రాఫిక్ కు సంబంధించి జాతీయ రహదారి ప్రాధికారక సంస్థ (NHAI) గానీ, రోడ్డు నిర్మాణ సంస్థ గానీ స్పందించకపోవడం గమనార్హం.
24 గంటల్లో 5 కి.మీ ప్రయాణం
ప్రస్తుతం ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లో కేవలం 5 కి.మీ మాత్రమే ముందుకు ప్రయాణించినట్లు ఓ ట్రక్ డ్రైవర్ వాపోయాడు. ‘గత 30 గంటల్లో మేము కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగాం. టోల్ ఫీజులు, పన్నులు అన్నీ చెల్లించినా చాలా కష్టంగా ప్రయాణం జరుగుతోంది. రోడ్డుపై ఎక్కడా NHAI సిబ్బంది గానీ, అధికారులు గానీ కనిపించడం లేదు’ అని ట్రక్ డ్రైవర్ ప్రవీణ్ సింగ్ అన్నారు.
Also Read: Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీకి బిగ్ షాక్.. అయినా అవేం పనులు..
‘ఆకలి, దాహంతో అల్లాడుతున్నాం’
‘2 రోజులుగా ట్రాఫిక్ జామ్‌లోనే ఉన్నాం. ఆకలితో, దాహంతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంటల సమయం పడుతోంది’ అని మరో ట్రక్ డ్రైవర్ సంజయ్ సింగ్ తెలిపారు. మరోవైపు ఈ ట్రాఫిక్ జామ్ వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పాడయ్యే ఆహార వస్తువులు తీసుకెళ్తున్న డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్సులు, పర్యాటక వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
