Mohan Babu University: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)కు షాక్ తగిలింది. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు సంబంధిత ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం, విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయ వివరాలు దాచిపెట్టడం వంటి ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్‌ఆర్‌ఎంసీ) తీవ్ర చర్యలు తీసుకుంది. రూ.15 లక్షల జరిమానా విధించిన అధికారులు, యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ విషయం విద్యా వ్యవస్థలో నియంత్రణ ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేస్తోంది.
Read also-Mallareddy villain offer: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మొదట విలన్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..
యూనివర్సిటీ నేపథ్యం
మోహన్‌బాబు యూనివర్సిటీ 2022లో శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మార్చి స్థాపించారు. ఇక్కడి సీట్లలో 70% మరియు గ్రీన్‌ఫీల్డ్ కోర్సుల్లో 35% కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్ల ఫీజులను కమిషన్ మాత్రమే నిర్ణయించాలి, కానీ యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదులు
ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ 2024 డిసెంబర్‌లో కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. హాస్టల్‌లో ఉండని విద్యార్థుల నుంచి మెస్ చార్జీలు, భవన ఫీజు, అదనపు ట్యూషన్ ఫీజు వంటివి వసూలు చేస్తోందని, ఆదాయ వివరాలు దాచిపెట్టడం, హాజరు రికార్డుల్లో లోపాలు, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ త్రిసభ్యు కమిటీని ఏర్పాటు చేసి 2024 డిసెంబర్ 25 నుంచి 29 వరకు సర్ప్రైజ్ ఇన్‌స్పెక్షన్ జరిపింది. విచారణలో, 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి రూ.26.17 కోట్ల అదనపు ఫీజు వసూలు చేసినట్టు తేలింది.
కమిషన్ చర్యలు
2025 జనవరిలో మొదటి జరిమానా కింద రూ.15 లక్షలు విధించారు. యూనివర్సిటీ ఈ మొత్తం చెల్లించింది. అయితే మళ్లీ కొత్త ఉత్తర్వులను యూనివర్సిటీ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజు రూ.26.17 కోట్లు 15 రోజుల్లో వారికి తిరిగి చెల్లించాలని తెలిపింది. అంతే కాకుండా రూ.15 లక్షల జరిమానా కట్టాలని తెలిపింది. ఈ వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో పబ్లిక్ చేశారు. ఈ వరుస ఉల్లంఘనల కారణంగా యూనివర్సిటీ గుర్తింపు వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థుల సౌకర్యం కోసం పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి విద్యాసంస్థ తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అయితే మోహన్ బాబు దీనిపై ఏమీ స్పందించినట్లుగా లేరు. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.
