Medicine Nobel 2025: ప్రస్తుత ఏడాది 2025కిగానూ నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రక్రియ మొదలైంది. ఎప్పటిమాదిరిగానే మొదటగా వైద్యరంగ శాస్త్రవేత్తలకు (Medicine Nobel, 2025) ఇవాళ (అక్టోబర్ 6, సోమవారం) అవార్డులు ప్రకటించారు. వైద్యరంగంలో కృషికిగానూ శాస్త్రవేత్తలు మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకగుచీ కృషికి నోబెల్ పురస్కారాలు వరించాయి. మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ (immune system) తప్పుగా సొంత కణాలకు హాని కలిగించకుండా నియంత్రించే ‘ఫెరిఫెరల్ ఇన్యూన్ టాలరెన్స్ (peripheral immune tolerance) విధానాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారకాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా చంపేస్తుంది. అయితే, అదే రక్షణ వ్యవస్థ మన శరీర కణాలను తప్పుగా శత్రువులుగా భావించి దాడి చేయడాన్ని ‘ఆటోఇమ్యూన్ డిసీజ్’ (autoimmune disease) అంటారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు రూపొందించిన ‘ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’ విధానంలో ‘సొంత కణాల’పై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయకుండా టీ-సెల్స్ (T-cells -immune cells) ద్వారా నియంత్రించవచ్చని పరిశోధన ద్వారా సాధించారు.
వైద్యశాస్త్రంలో నోబెల్ విజేతలను స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ యూనివర్శిటీలోని నోబెల్ అసెంబ్లీ ఎంపిక చేస్తుంది. వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నవారికి 1.1 కోట్ల స్వీడిష్ క్రౌన్లు (దాదాపు 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు) నగదు బహుమతి, స్వీడన్ రాజు చేతుల మీదుగా బంగారు పతకం లభించనున్నాయి. ‘మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకగుచీ పరిశోధనలో కొత్త దిశను చూపించారని నోబెల్ అసెంబ్లీ కొనియాడింది. క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధుల విషయంలో కొత్త చికిత్సా విధానాల అభివృద్ధికి వీరి పరిశోధన దోహదపడిందని ప్రకటనలో తెలిపింది. గతంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన ప్రసిద్ధ శాస్త్రవేత్తల్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా ఉన్నారు. ఆయన 1945లో పెన్సిలిన్‌ను కనుగొన్నందుకు ఈ అవార్డు పొందారు.
Read Also- Forrest camp: అడవిలో క్యాంపింగ్.. 3 రోజులు చెట్ల మధ్య జీవిస్తే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
కాగా, నోబెల్ బహుమతులను డైనమైట్‌ను కనుగొన్న స్వీడన్ శాస్త్రవేత్త, సంపన్నుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా పురస్కారాలను ప్రదానం చేస్తారు. 1901 నుంచి ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతోంది. సైన్స్, సాహిత్యం, శాంతి అవార్డులను తొలి నుంచి ఇస్తున్నారు. అయితే, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే కొన్ని సార్లు నిలిపివేశారు. ఇక, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అనంతర కాలంలో జోడించారు. ఈ అవార్డుకు స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ‘రిక్స్‌బ్యాంక్’ నిధులు అందిస్తుంది.
ఇక, అవార్డుల విజేతలను వివిధ సంస్థల నిపుణుల కమిటీలు ఎంపిక చేస్తాయి. శాంతి పురస్కారం మినహా, మిగతా అన్ని అవార్డులను స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు. శాంతి అవార్డును మాత్రం నార్వే రాజధాని ఒస్లోలో ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ కాలంలో స్వీడన్-నార్వే మధ్య ఏర్పడిన రాజకీయ సంబంధాలకు వారసత్వ చిహ్నంగా శాంతి బహుమతి ప్రదానానికి ఒస్లోని వేదిక చేశారు.
Read Also- Medicine Nobel 2025: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు.. ఏం సాధించారో తెలుసా?
