Forrest Camp: అడవిలో క్యాంపింగ్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతను పొందడంతో పాటు శారీరక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. “ఫారెస్ట్ బాతింగ్” (Forest Bathing) అనే పేరుతో జరిగిన అధ్యయనాల ప్రకారం.. ప్రకృతిలో గడిపే సమయం మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. క్యాన్సర్ తోపాటు ఇతర ప్రాణాంతక వైరస్‌లతో మన శరీరం పోరాడే శక్తిని పెంచుతుంది. అడవిలో క్యాంపింగ్.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ కథనంలో పరిశీలిద్దాం.
రోగనిరోధక వ్యవస్థకు బలోపేతం
మూడు రోజుల పాటు అడవిలో క్యాంపింగ్ చేయడం ద్వారా శరీరంలోని నేచురల్ కిల్లర్ (NK) కణాలను గణనీయంగా పెంచుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా ఎన్‌కే కణాలు శరీరానికి రక్షణగా నిలుస్తుంటాయి. అవి క్యాన్సర్ వంటి కణాలపై కూడా సమర్థవంతంగా పోరాడగలవు. ఓ అధ్యయనం ప్రకారం.. అడవిలో క్యాంపింగ్ చేసిన తర్వాత ఎన్‌కే కణాల చురుకుదనం గతంలో కంటే 50 శాతం మేర పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వీటివల్ల క్యాన్సర్ కణాలు పూర్తిగా నశిస్తాయని చెప్పలేం కానీ.. రోగనిరోధక వ్యవస్థ మాత్రం గణనీయంగా బలోపేతం అవుతుందని చెప్పవచ్చు. అంతేకాదు క్యాంపింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎన్‌కే కణాల చురుకుదనం వారం రోజుల పాటు అలాగే కొనసాగినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఆరోగ్య ప్రయోజనాలు
అడవిలో క్యాంపింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తాజా గాలి: అడవిలోని శుభ్రమైన గాలి మీ శరీరానికి మేలుచేస్తుంది. శరీర భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం: ప్రకృతిలో గడిపే సమయం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
మొక్కల శక్తి: చెట్లు ఫైటోన్సైడ్స్ (Phytoncides) అనే సహజ రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి మీ NK కణాలను బలోపేతం చేసి వైరస్‌లు, క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
అందరికీ పనిచేస్తుందా?
అడవిలో క్యాంపింగ్ చేయడం ద్వారా అందరికీ ఒకేలాంటి ప్రయోజనం చేకురుతుందా అంటే కచ్చితంగా చెప్పలేము. క్యాంపింగ్ చేసే ప్రాంతంలోని వాతావరణం, ప్రకృతిని ఏ స్థాయిలో ఆస్వాదిస్తారు? అనారోగ్య సమస్యలు వంటి అంశాలు క్యాంపింగ్ వల్ల లభించే ప్రయోజనాలను ప్రభావితం చేయవచ్చు. తాజాగా జరిపిన అధ్యయనం అతికొద్ది మంది పైనే జరిగింది. భవిష్యత్తులో మరింత విస్తృతస్థాయిలో పరిశోధనలు జరపడం ద్వారా.. మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: Viral Video: వీడెవడ్రా.. డ్రోన్‌కు కోడిని కట్టి గాల్లోకి వదిలాడు, తర్వాత ఏమైందంటే?
ఓసారి ట్రై చేయండి..
ఈసారి లాంగ్ వీకెండ్ దొరికినప్పుడు పర్యటనలకు కాకుండా అడవిలో క్యాంపింగ్ చేయడానికి ప్రయత్నించండి. మూడు రోజుల పాటు అడవిలో చెట్ల మధ్య జీవించేందుకు ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా తాజా గాలిని పీల్చడం, ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదించడం వంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఒంటరిగా కాకుండా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో క్యాంపింగ్ కు వెళ్తే.. ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకోవచ్చు.
