GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్(Property tax) మొండి బకాయిలపై ఉన్నతాధికారులు నజర్ పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో మార్చి నెలాఖరుకల్లా సుమారు రూ. 2038 కోట్ల మేరకు ఆస్తి పన్ను వసూలు చేసుకున్న జీహెచ్ఎంసీ దశాబ్దాలుగా వసూలు కాకుండా పేరుకుపోయిన రూ. 600 కోట్లను వసూలు చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీని కొంత మేరకైనా గట్టెక్కించేందుకు అందుబాటులోనున్న అన్ని రకాల ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోవటంతో పాటు ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను ఈ వర్తమాన సంవత్సరం చివరి కల్లా ఎలాగైనా సరే వసూలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు ఎలాంటి కార్యాచరణను సిద్దం చేయాలి? సర్కిళ్ల స్థాయిలో కమిటీలను నియమించే అంశాలపై త్వరలోనే కమిషనర్ కర్ణన్ కమిటీలు నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
మొండి బకాయిలు రూ. 600 కోట్లు..
సర్కిల్ స్థాయిలో ట్యాక్స్ వసూలు చేసే ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లతో సర్కిళ్ల వారీగా కమిటీలను నియమించి, వారికి డైలీ కలెక్షన్ టార్గెట్లు ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దశాబ్దకాలం క్రితం రాష్ట్ర విభజన జరగకముందు సుమారు రూ. 200 నుంచి రూ. 250 కోట్ల మధ్యనున్న మొండి బకాయిలు ఇపుడు ఏకంగా రూ. 600 కోట్లకు పెరిగినట్లు అధికారులు అంచనాలు వేసినట్లు తెలిసింది. వీటి వసూళ్లకు సంబంధించిన సర్కిల్ స్థాయిలో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు కీలక బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలుత బకాయిదారులను ట్యాక్స్ స్టాఫ్ నేరుగా కలిసి నోటీసులు జారీ చేసి, పన్ను చెల్లించాల్సిన ఆస్తి స్థితిగతులను అంచనా వేసి, వసూలు చేసుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను ఫీల్డు లెవెల్ స్టాఫే సూచించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. నోటీసులు జారీ చేసేందుకు ఫీల్డు వెళ్లనున్న ట్యాక్స్ సిబ్బంది తొలుత మొండి బకాయిలున్న ఆస్తి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తుందా? కమర్షియల్ పన్ను చెల్లిస్తుందా? అన్న విషయాన్ని పరిశీలించి, నివేదికలను సమర్పించాలని ఆదేశించనున్నారు.
20 లక్షలు దాటనున్న ట్యాక్స్ చెల్లింపు ఖాతాలు
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రస్తుతం 19.50 లక్షల ఆస్తుల యజమానులు జీహెచ్ఎంసీకి ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వీరిలో రెండు నుంచి రెండున్నర లక్షల మంది ఆస్తుల యజమానులు కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు సమాచారం. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వచ్చే మార్చి నెలాఖరు కల్లా ఈ ఆస్తుల సంఖ్య సుమారు 20 లక్షలు దాటనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: MLC Kavitha: పండగంటే పది మందితో కలిసి ఆనందంగా జరుపుకోవడం: ఎమ్మెల్సీ కవిత
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే..
అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని ఆస్తులు సుమారు 70 వేల వరకున్నట్లు అధికారులు ఇటీవలే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) ద్వారా ఇటీవలే గుర్తించారు. ఈ భవనాలెందుకు పన్ను పరిధిలోకి రాలేదు? కారణం ఏమిటీ? అన్న విషయాన్ని లోతుగా పరిశీలించి, భవనాలు ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాకపోవటానికి సిబ్బంది ఏమైనా కారణమా? అన్న విషయాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ 70 వేల భవనాల వినియోగాన్ని బట్టి చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చి, వాటికి ఏకంగా మూడేళ్ల ట్యాక్స్ వడ్డించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ 70 వేల ఆస్తులు ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి వస్తే జీహెచ్ఎంసీకి ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తుల సంఖ్య 20 లక్షల 20 వేలకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ భవనాలు ఎపుడు నిర్మించారు? జీహెచ్ఎంసీ అనుమతితోనే నిర్మించారా? అనుమతులను అతిక్రమించి నిర్మించారా? అన్న కోణాల్లో పరిశీలించి, ఆ ఆస్తులను కూడా ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి తీసురావాలని భావిస్తున్నారు.
ఆ భవనాలకు కమర్షియల్ ట్యాక్స్ వర్తింపు
జీహెచ్ఎంసీకి ప్రపార్టీ ట్యాక్స్ చెలిస్తున్న 19.50 లక్షల ఆస్తులపై జీఐఎస్ సర్వేతో పాటు కరెంటు మీటర్లను లింకు చేసిన జీహెచ్ఎంసీ ఆరు జోన్ల పరిధిలో సుమారు 93 వేల ఆస్తుల యజమానులు కరెంటు మీటర్లను కమర్షియల్ గా వినియోగిస్తూ, జీహెచ్ఎంసీకి మాత్రం రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఆ ఆస్తులకు త్వరలోనే మూడేళ్లకు కమర్షియల్ ట్యాక్స్ ను విధించి, నోటీసులు జారీ చేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఈ భవనాలన్ని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటంతో అదనంగా రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ట్యాక్స్ వసూలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు లెక్కలేస్తున్నారు.
Also Read: Ram Charan: ‘పెద్ది’ కోసం వాటిని పక్కన పెట్టిన రామ్ చరణ్.. అయినా పర్లేదా?
