GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ(GHMC) సిటీలో ప్రతిపాదించిన హెచ్ సిటీ(H-City) పనులు, ట్యాక్స్ కలెక్షన్ పైన స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ నుంచి వాహనదారులకు ఊరట కల్గించేందుకు రూ. 7032 కోట్లతో ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గత సంవత్సరం డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేసి, నిధులకు పరిపాలనపరమైన మంజూరీ ఇచ్చినా పనులు ముందుకు సాగకటపోవటం, ప్రతి నెల టార్గెట్ కు తగినట్టుగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేసే విషయాలపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు సమాచారం.
కేబీఆర్ చుట్టూ ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు..
గతంలో కమిషనర్లు తమకు ప్రాజెక్టులు గుర్తుకోస్తే, సర్కారు ఆదేశిస్తే తప్పా సమీక్షలు నిర్వహించే వారు. కానీ కమిషనర్ కర్ణన్ అందుకు భిన్నంగా వ్యవహారిస్తున్నారు. హెచ్ సిటీ పనులపై ప్రతి మంగళవారం సమీక్ష నిర్వహించటంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. కేబీఆర్ చుట్టూ చేపట్టాల్సిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఆరు అండర్ పాస్ ల నిర్మాణానికి స్థల సేకరణ కోసం మార్కింగ్ లు చేసినా, ఎందుకు ప్రక్రియ ముందుకు సాగటం లేదన్న విషయంపై కూడా కమిషనర్ నేరుగా ఫీల్డుకెళ్లి స్థలాలివ్వాల్సిన యజమానుల్లో ఒకరైన అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో చర్చలు జరిపారు. స్థలాలిచ్చేందుకు జానారెడ్డి సుముఖత ను వ్యక్తం చేయటంతో కోర్టు కేసుల్లేని ప్రాంతాల్లో పనులు మొదలు పెట్టాలని కమిషనర్ ఇంజనీరింగ్ వింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మార్చి నెల ప్రారంభానికి హెచ్ సిటీ పనులన్నీ గాడీన పెట్టేందుకు ఇంజనీరింగ్ వింగ్ కసరత్తు మొదలు పెట్టింది.
Also Read: Investment Scam: అధిక లాభాల ఆశ చూపి కోట్లు దోచేస్తున్న ముఠా అరెస్ట్ .. ఎక్కడంటే?
జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు
దీంతో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతి నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి జాప్యం జరగకుండా నెలలో 30 రోజులు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ జరగాల్సిందేనని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. సిటీలోని మొత్తం 30 సర్కిళ్లలో నెలకు కనీసం రూ. వంద కోట్ల ట్యాక్స్ కలెక్షన్ జరగాలని ఆదేశించిన కమిషనర్ తరుచూ టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ఎప్పటికపుడు ట్యాక్స్ స్టాఫ్ పనితీరును పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ(GHMC)కి రావాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా, నేరుగా ఖజానాకు వెళ్లేలా ఆధునిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సం (2025-26)లో టార్గెట్ గా పెట్టుకున్న రూ. 2500 కోట్ల మార్కును మార్చి నెలాఖరు కల్లా దాటించాలని కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
రూ. 1400 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్..
గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో రూ. 2 వేల కోట్ల కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకోగా, మార్చి నెల చివరి రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాక్స్ కలెక్షన్ రూ. 2038 కోట్లు వసూలైంది. ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు పెంచుకుంటుంది. కానీ వర్తమాన ఆర్థిక సంవత్సరం మాత్రం ఏకంగా రూ. 462 కోట్ల అత్యధిక, రికార్డు స్థాయి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 1400 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ అయినట్లు సమాచారం. రానున్న అయిదు నెలల్లో టార్గెట్ కు మిగిలిన రూ. 1100 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా, అక్టోబర్ మాసం నుంచి ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు వీక్లీ, మంత్లీ టార్గెట్ లు విధించి, తరుచూ కమిషనర్ నేరుగా సమీక్షించటంతో రానున్న అయిదారు రోజుల్లో ట్యాక్స్ కలెక్షన్ ఊపందుకోనున్నట్లు తెలిసింది.
Also Read: Crime News: బోరబండలో హత్య కలకలం.. భర్తను సుత్తితో అతి దారుణంగా చంపిన భార్య!
