Telangana BJP: బీజేపీలో కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ఇప్పట్లో చెక్ పడే పరిస్థితులు కనిపించడంలేదు. నివురుగప్పిన నిప్పులా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. చిచ్చుపెట్టే వారే తప్పితే దాన్ని చల్లార్చే వారు కూడా కరువయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఈ చిచ్చు.. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరో కార్చిచ్చుకు దారితీసింది. అభ్యర్థుల కేటాయింపు అంశంలో మళ్లీ పాత వర్సెస్ కొత్త నేతల మధ్య పంచాయితీ మొదలైనట్లుగా తెలుస్తోంది. పార్టీ కమిటీల్లోనూ పాత వారికే ప్రియారిటీ ఇచ్చి కొత్తవారికి మొండిచేయి చూపించారు. ఇప్పుడు అభ్యర్థుల కేటాయింపు అంశంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. దీంతో పాత నేతలు తమను నమ్ముకున్న వారికి ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
గెలుపు గుర్రాలకే టికెట్లు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీజేపీ(BJP)లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) కరీంనగర్ గడ్డ నుంచి ప్రకటించారు. తొలుత జెడ్పీటీసీ(ZPTC) అభ్యర్థులను డిక్లేర్ చేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఏకగ్రీవంగా ఉన్నచోట బీఫామ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో(Local Body Elections) గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని కరీంనగర్ జిల్లాలో ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుండబద్దలు కొట్టారు. సర్వే ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.
ఇప్పటికే ఒక దఫా పూర్తయినట్లుగా స్పష్టంచేశారు. దీంతో శ్రేణులు, ఆశావహుల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ సర్వే చేసేది ఎవరు? పార్టీ ఎవరిని ఫైనల్ చేయనుందనేది ఉత్కంఠగా మారింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మరింత ఆందోళనలో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఒకరిద్దరు నేతలను మినహాయిస్తే ఎవరికీ ప్రియారిటీ ఇవ్వలేదు. ఇది మొన్నటి కమిటీలతో మరోసారి తేటతెల్లమైంది. చివరకు లీడర్ నే పట్టించుకోని పార్టీ కేడర్ ను ఎక్కడ పట్టించుకుంటుందనే పరిస్థితి బీజేపీలో ఏర్పడింది.
Also Read: Crime News: బోరబండలో హత్య కలకలం.. భర్తను సుత్తితో అతి దారుణంగా చంపిన భార్య!
పార్టీలో పాత వర్సెస్ కొత్త..
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన లీడర్లతో వారి అనుచరగణం కూడా వచ్చి చేరింది. తమకు ప్రియారిటీ దక్కుతుందని భావించిన వారి ఆశలన్నీ అడియాసలుగా మారాయి. దీంతో అటు లీడర్ ఇటు కేడర్ భవితవ్యం కూడా ప్రమాదకరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో పాత వర్సెస్ కొత్త అనే ముసులం రాజుకుంది. గతంలో బీజేపీ(BJP)లో చేరిన లీడర్లంతా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరుసగా ఒకరి వెనుక ఒకరు పార్టీ మారిపోయిన విషయం తెలిసిందే. దీంతో కాషాయ పార్టీలో కొత్త వారిని చేర్చుకున్నా అందుకు తగినట్లుగా ప్రాధాన్యత ఇవ్వడంలేదనేది తేటతెల్లమైంది. అయినా ఇప్పటికీ ఉన్న వారిని కాపాడుకుని అధికారంలోకి రావాలన్న ఆలోచన పార్టీకి లేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త నేతలను నమ్ముకున్న వారికి లోకల్ బాడీ ఎన్నికల ద్వారా అయినా న్యాయం జరుగుతుందా? లేదా? అనేది అర్థంకాని పరిస్థితి పార్టీలో నెలకొంది.
కేంద్ర మంత్రి బండి వర్సెస్ ఎంపీ ఈటల..
ఇప్పటికే ఆయా జిల్లాల్లో కమిటీల చిచ్చు సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) స్థానిక జిల్లా అధ్యక్షుడి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ అంశంపై సమస్యను పార్టీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన సంస్థాగత ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారీ(Chandrashekhar Tiwari)కి ఫుట్ బాల్ ఇచ్చిమరీ వినూత్నంగా నిరసన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు శ్రేణులకు శాపంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి వర్సెస్ ఎంపీ ఈటల(Bandi Sanjay) మధ్య కోల్డ్ వార్ సాగుతోందనేది బహిరంగ రహస్యమే. కమిటీల నియామకంలోనూ ఇది బహిర్గతమైంది. ఈటల వర్గమైతే చాలు అది ఎవరైనా సరే పక్కన పెట్టేస్తున్నారనే స్థితికి ఈ వార్ సాగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం బలంలేదు. అలాంటిది బండి సంజయ్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీకి ఊపొచ్చింది. బీఆర్ఎస్(BRS) కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కానీ ఆయన తొలగింపు అనంతరం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. ఘోర పరాజయం చవిచూసింది. 8 స్థానాలకే పరిమితమైంది. గతంలో పోలిస్తే తమకు 7 స్థానాలు పెరిగాయని చెప్పుకుని సంతోషపడిన సందర్భాలున్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ చరిష్మాతో 8 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో పార్టీ విస్తరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 45 లక్షల సభ్యత్వ నమోదు చేశారు. అయితే ఏయే జిల్లాల్లో ఎవరి వల్ల పార్టీ ఎదుగుదల సాధ్యమైందనే కారణాలను కూడా పార్టీ పట్టించుకోకుండా టికెట్ల కేటాయింపులో ఎక్కడ మొండిచేయి చూపిస్తారోననే భయం కొత్త నేతలకు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Local Body Elections: బండి వర్సెస్ ఈటల.. మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. బీజేపీ తర్జన భర్జన
రాజకీయ వర్గాల విశ్లేషకులు..
కొన్ని జిల్లాల్లో బీజేపీ తరుపున స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సరిగ్గా లేరనేది తెలిసిందే. ఉమ్మడి వరంగల్(Warangal), నల్లగొండ(Nalgonda), ఖమ్మం(Khammam)లో చెప్పుకోదగిన లీడర్ కూడా కరువయ్యారు. లీడర్, కేడర్ ఉన్న జిల్లాల్లో ఇంటర్నల్ వార్ వల్ల పార్టీ ఎదుగుదలకు బ్రేక్ పడుతోందని రాజకీయ వర్గాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఉమ్మడి పాలమూరులో డీకే అరుణ(DK Aruna) వర్సెస్ శాంతికుమార్(Shanthi Kumar) అన్నట్లుగా పరిస్థితి మారింది. పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఎదుటే పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ లోనూ అర్వింద్ కు మరో నేతకు మధ్య చెడినట్లు తెలుస్తోంది. సదరు నేతను పార్టీలోకి ఆహ్వానించింది అర్విందే అయినా.. ఇప్పుడు ఇరువురికి పొసగడంలేదని తెలుస్తోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy) సైతం కొద్దిరోజులుగా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన సైలెంట్ గా ఉంటూ తన సెగ్మెంట్ కు మాత్రమే పరిమితమయ్యారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇటీవల ఒకట్రెండు ప్రోగ్రామ్స్ తప్పితే ఎక్కడా కనిపించడంలేదు. ప్రాధాన్యత విషయంతో పాటు పాత, కొత్త నేతల మధ్య పంచాయితీలే దీనికి ప్రధాన కారణంగా పొలిటికల్ సర్కిల్స్ లో చెబుతున్నారు.
పార్టీకి డ్యామేజ్ తప్పదా..
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన వారికి డబుల్ డిజిట్ కూడా దాటని పరిస్థితి ఉంది. అయితే క్రమంగా పార్టీ ఎదగడంతో ఈసారి ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. లోకల్ వార్ లో తమ సత్తా ఏంటో చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని పార్టీ భావిస్తోంది. అయితే అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు పడటంలేదనే విమర్శలు శ్రేణుల నుంచి వస్తున్నాయి. ఇటీవల కమిటీల్లో కొత్తవారికి మొండిచేయి చూపినట్లుగానే టికెట్ల కేటాయింపులోనూ జరిగితే పార్టీకి డ్యామేజ్ తప్పదని చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నికల బరిలో నిలిచిన నేతకు వచ్చిన ఓట్లే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.
కాలానుగుణం, ప్రస్తుత అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తే కాషాయ పార్టీ బొక్కబోర్లా పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అంతర్యుద్ధాన్ని పక్కకు పెట్టి ముందుకు వెళ్తే బెటర్ అనే సూచనలు చేస్తున్నారు. ఇదిలాఉండగా ఈసారి కూడా పాతవారికే టికెట్లు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని బీజేపీలో చేరిన నేతల అనుచరులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ సమస్యను అధిగమించడంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Alsom Read: Eagle Team: మరో సక్సెస్ సాధించిన ఈగల్ టీం.. 2 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్
