Eagle Team: వైజాగ్ నుంచి రాజస్తాన్(Rajasthan) తరలిస్తున్న 2కోట్ల రూపాయల విలువ చేసే 400 కిలోల గంజాయిని ఈగల్ టీం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్ రాష్ట్రం చిత్తోర్ ఘడ్ కు చెందిన చోటూ నారాయణ లాల్ నాయక్ (34), పుష్కర్ రాజ్ నాయక్ (24), కిషన్ లాల్ నాయక్ (34) లు స్నేహితులు. ఇదిలా ఉండగా చిత్తోర్ ఘడ్ కే చెందిన ఓం బిష్ణోయ్ స్థానికంగా గంజాయి దందా చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన శ్రీధర్ ఎలియాస్ గురూ నుంచి గంజాయి కొని తెప్పించుకుంటూ చాలా రోజులుగా ఈ వ్యాపారం చేస్తూ వస్తున్నాడు.
సొంతంగా గంజాయి దందా..
ప్రతీసారి చోటూ నారాయణ లాల్ నాయక్ ను రాజమండ్రికి హుండయ్ కారులో పంపించి గంజాయి తెప్పిస్తూ ఒక్కో ట్రిప్పు నకు 25వేల రూపాయలు ఇస్తూ వస్తున్నాడు. కాగా, ఇటీవల ఓం బిష్ణోయ్ ని ఒడిషా రాష్ట్రం జగదల్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అవకాశంగా తీసుకున్న చోటూ నారాయణ లాల్ నాయక్ సొంతంగా గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శ్రీధర్ తో మాట్లాడి సరుకు కోసం తాను వస్తున్నానని చెప్పాడు. 400 కిలోల గంజాయిని సిద్ధం చేసి పెట్టమన్నాడు. అనంతరం పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్ లతో కలిసి తన హుండయ్ కారుతోపాటు ఈచర్ వ్యాన్ తీసుకుని రాజమండ్రికి వెళ్లాడు. 2వేల రూపాయలకు కిలో చొప్పున 400 కిలోల గంజాయి కొని ప్యాకెట్లలో ప్యాక్ చేయించి వ్యాన్ లో లోడ్ చేసుకున్నాడు. పైనుంచి కొబ్బరిబోండాలు పెట్టాడు.
Also Read: Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గెలుపు స్ట్రాటజీ.. ప్రణాళిక ప్రతిపాదనలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద..
కిషన్ లాల్ నాయక్ ఈచర్ వ్యాన్ నడుపుతుండగా చోటూ నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్ హుండయ్ కారులో ఎస్కార్టుగా రాజస్తాన్(Rajasthan) కు బయల్దేరారు. ఈ మేరకు సమాచారం అందుకున్నరాచకొండ నార్కొటిక్, ఖమ్మం(Khammam) ఆర్ఎన్సీసీ పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈచర్ వ్యాన్ ను పట్టుకుని గంజాయిని సీజ్ చేశారు. పోలీసులను చూడగానే చోటూ నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్ లు హుండయ్ కారులో ఉడాయించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా రాజస్తాన్ కు చెందిన అశూ, పరమేశ్వర్ లకు 4వేల రూపాయలకు కిలో చొప్పున అమ్మేందుకు గంజాయి తీసుకెళుతున్నట్టుగా వెల్లడైంది. పక్కగా సమాచారాన్ని సేకరించి గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఎస్పీలు శ్రీధర్, రమేశ్, సీఐలు విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఎప్ఐలు రవికుమార్, జీవన్ రెడ్డిలను ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య అభినందించారు.
Also Read: Investment Scam: అధిక లాభాల ఆశ చూపి కోట్లు దోచేస్తున్న ముఠా అరెస్ట్ .. ఎక్కడంటే?