Putin on PM Modi: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఘాటుగా స్పందించారు. భారత్ ఎప్పుడూ ఇలాంటి ఒత్తిళ్లకు లోనుకాదని పేర్కొన్నారు. ఆ దేశం ఎవరి ముందు తలవంచదని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీని సైతం ఆకాశానికెత్తారు.
భారత్‌తో ప్రత్యేక అనుబంధం
రష్యాలోని సోచి నగరంలో జరిగిన వాల్దాయ్ డిస్కషన్ గ్రూప్ సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రసంగించారు. ప్రధాని మోదీ.. గొప్ప జ్ఞానం ఉన్న నాయకుడని కొనియాడారు. అలాగే మాస్కో – దిల్లీ మధ్య ఉన్న స్నేహాబంధాన్ని గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధం ఉందని పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడమనేది పూర్తిగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ అంశం లేదని పేర్కొన్నారు. ఒకవేళ రష్యా నుంచి ఇంధన సరఫరాను భారత్ నిలిపివేస్తే.. ఆ దేశం 9-10 బిలియన్ డాలర్ల నష్టాలను చవి చూడొచ్చని పుతిన్ అంచనా వేశారు.
భారత్ తలవంచదు
ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాల వల్ల కూడా దాదాపు 9-10 బిలియన్ డాలర్ల నష్టమే భారత్ కు వాటిల్లుతుందని పుతిన్ పేర్కొన్నారు. నష్టం అంతే ఉన్నప్పుడు రష్యా ఆయిల్ ను వదలుకోవడం వల్ల ఏంటి ప్రయోజనమని పుతిన్ ప్రశ్నించారు. అమెరికా విధించే అదనపు సుంకాల వల్ల భారత్ ఎదుర్కొనే నష్టాలను తమ ముడి చమురు దిగుమతులు సమతుల్యం చేస్తాయని పేర్కొన్నారు. అమెరికా బెదిరింపులకు తలదించకపోవడం ద్వారా భారత్ ఒక సార్వభౌమ దేశంగా తన గౌరవాన్ని మరింత పెంచుకుంటుందని పుతిన్ అన్నారు.
మోదీ.. తెలివైన నాయకుడు
సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత్ తో తమకు అనుబంధం ఉందని పుతిన్ గుర్తుచేశారు. భారత్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో రష్యా వారికి సహకరించిందని పేర్కొన్నారు. అయితే భారత్ తమను తాము ఎవరిచేత అవమానించబడటానికి ఎప్పటికీ ఒప్పుకోరని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తెలివైన నాయకుడని.. ఆయన దేశం కోసం ఆలోచిస్తారని చెప్పారు. కాబట్టి ప్రధాని మోదీ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోరని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మోదీ తనకు మంచి స్నేహితుడని.. భారత్ తో రష్యాకు సమస్యలు, అంతరాష్ట్ర ఉద్రిక్తతలు రాలేదని పేర్కొన్నారు. మోదీతో సంభాషణ తనకు ఎల్లప్పుడు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రశంసించారు. ఆయన జాతీయ ప్రయోజనాల కట్టుబడి ఉన్న నాయకుడని కొనియాడారు.
“PM Modi is a very reasonable, wise leader.
I am looking forward to my trip in early December and await meeting my dear friend and trust-worthy partner PM Modi.”
– Russian President Vladimir Putin pic.twitter.com/Y4E5prjShW
— News Arena India (@NewsArenaIndia) October 3, 2025
Also Read: Sandeep Reddy Vanga: ‘కాంతార చాప్టర్ 1’పై ‘యానిమల్’ దర్శకుడు షాకింగ్ కామెంట్స్..
వాణిజ్య లోటు భర్తీ చేస్తాం
అయితే రష్యా-భారత్ వాణిజ్యంలో అసమతుల్యత ఉన్నప్పటికీ దాన్ని తగ్గించడానికి ఇరు దేశాలు కృషి చేయవచ్చని పుతిన్ అన్నారు. దీనిని తగ్గించేందుకు రష్యా తన వంతు కృషి చేస్తుందని అన్నారు. ‘భారత్ నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ఔషధాలు, ఫార్మాస్యూటికల్ రంగంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మన అవకాశాలు, ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్, చెల్లింపుల సమస్యలను పరిష్కరించాలి’ అని ఆయన వివరించారు. రష్యా-భారత్ ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ ప్రకటనకు త్వరలో 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పుతిన్ ఈ మేరకు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

