Elon Musk: ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరో అసాధారణమైన మైలురాయి అందుకున్నారు. ఫోర్బ్స్ సంపన్నుల సూచీ ప్రకారం, బుధవారం నాటికి ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ 500 బిలియన్ డాలర్ల (రూ. 44 లక్షల కోట్లకు పైమాటే) మైలురాయిని చేరింది. దీంతో, భూమ్మీద ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం, బుధవారం మస్క్ సంపద 500.1 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది డిసెంబర్‌లో ఆయన 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటారు. ఆ స్థాయికి చేరిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం గమనార్హం. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న ల్యారీ ఎలీసన్ కంటే మస్క్ ఏకంగా 150 బిలియన్ ఎక్కువ సంపదతో ఉన్నారు. మస్క్ సంపద ఇదే విధంగా పెరుగుతూపోతే ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉంది. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారంటూ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
5 ఏళ్లలో భారీ పెరుగుదల
గత ఐదేళ్లలో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. 2020 మార్చిలో ఆయన సంపద కేవలం 24.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే ఏడాది ఆగస్టు నెలలో టెస్లా షేర్ల భారీగా వృద్ధి చెందడంతో మస్క్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. ఇక, 2021 జనవరిలో ప్రపంచ సంపన్నుడిగా మస్క్ అవతరించారు. సెప్టెంబర్ 2021లో ఆయన ఆస్తి విలువ 200 బిలియన్ డాలర్లు మార్క్ చేసుకుంది. అదే ఏడాది నవంబర్ 2021లో 300 బిలియన్ బిలియన్ డాలర్లు, 2024 డిసెంబర్‌లో 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటారు. బుధవారం ఒక్క రోజే ఎలాన్ సంపద ఏకంగా 9.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు 83 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. టెస్లా షేర్లు బుధవారం దాదాపు 4 శాతం వృద్ధి చెందడంతో ఈ భారీ పెరుగుదల నమోదయింది. గతేడాది డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరిన టెస్లా మార్కెట్ విలువ మళ్లీ క్రమంగా ఆ స్థాయికి చేరుతోంది. టెస్లా కంపెనీలో మస్క్‌కు 12 శాతం వాటా ఉండగా, ప్రస్తుతం దాని విలువ సుమారు 191 బిలియన్ డాలర్లుగా ఉంది.
Read Also- Woman Found Alive: రెండేళ్లుగా వరకట్న వేధింపులు, హత్య కేసు.. ఇప్పుడు ఊహించని ట్విస్ట్
సంపద ఒక్క టెస్లా నుంచే కాదు
మస్క్ సంపద భారీ స్థాయిలో ఉండడానికి టెస్లా కంపెనీ ఒక్కటే కారణం కాదు, ఇతర కంపెనీలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. 2002లో స్థాపించిన రాకెట్ కంపెనీ ‘స్పేస్‌ఎక్స్’ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ఆగస్టు నెలలో జరిగిన ఓ ప్రైవేట్ టెండర్ ప్రకారం, ప్రస్తుతం స్పేస్ఎక్స్ కంపెనీ విలువ 400 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. గతేడాది డిసెంబర్‌లో ఆ కంపెనీ విలువ 350 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఏడాది తిరగకుండానే దాని వ్యాల్యూ భారీగా పెరిగింది. స్పేస్ఎక్స్ కంపెనీలో మస్క్‌కు 42 శాతం వాటా ఉంది. అంటే, ఇది సుమారు 168 బిలియన్ డాలర్లకు సమానం. మస్క్ స్థాపింపిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ హోల్డింగ్స్ (xAI Holdings) కంపెనీ విలువ భారీగానే ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ 113 బిలియన్ డాలర్ల విలువ చేస్తోంది. ఇందులో మస్క్‌కు సుమారుగా 53 శాతం వాటా ఉంది. ఇది 60 బిలియన్ డాలర్ల ఆస్తికి సమానం.
2033 నాటికి ట్రిలియనీర్
ఎలాన్ మస్క్ ఆస్తి విలువ ఇదే విధంగా పెరుగుతూ పోతే, 2033 మార్చి నాటికి మస్క్ ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉంటుంది. ఆ ఏడాదికల్లా కంపెనీల విలువ భారీగా పెరిగిపోతుంది. అయితే, 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిపై ఒక సందర్భంలో మస్క్ మాట్లాడుతూ, డబ్బు తనకు అంత ముఖ్యంకాదని అన్నాడు.
Read Also- IOB Good News: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అదిరిపోయే గుడ్‌న్యూస్