Woman Found Alive: సినిమాను తలపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో వెలుగుచూసింది. ఒక మహిళను అదనపు వరకట్నం కోసం వేధించి, హత్య చేశారని భావించి, సదరు మహిళ భర్త, అత్తమామలతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. గత రెండేళ్లుగా వీళ్లంతా వరకట్నం వేధింపులు, హత్య కేసు ఎదుర్కొంటున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా, హత్యకు గురైందని భావించిన మహిళ బతికే ఉన్నట్టు ఇటీవలే (Woman Found Alive) వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో 2023లో 20 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన భర్త ఇంటినుంచి అదృశ్యమైంది. ఎక్కడ వెతికినా, ఎంత అన్వేషించినా ఆమె జాడ దొరకలేదు. రోజులు గడుస్తున్నా ఆమె కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అదే ఏడాది అక్టోబర్ 23న ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదయింది. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా గాలించినా ఆమె గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో, కట్నం కోసం అత్తింటివారే హత్య చేశారని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో, కోర్టు ఆదేశాల మేరకు, ఆమె భర్తతో పాటు అతడి కుటుంబంలో మరో ఆరుగురిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304బీ (వరకట్న మరణం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
Read Also- Ponnam Prabhakar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి మంత్రి పొన్నం ధన్యవాదాలు.. కారణం ఏంటంటే?
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG), సర్వెయిలెన్స్ బృందాలు మిస్సింగ్ మహిళ ఆచూకీని మధ్యప్రదేశ్‌లో గుర్తించాయి. దీంతో, కేసు విచారణ ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఈ ట్విస్ట్‌పౌ ఔరైయా సర్కిల్ ఆఫీసర్ అశోక్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘పెళ్లి జరిగిన ఏడాదిన్నర తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. తొలుత మిస్సింగ్ కేసు నమోదైంది. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. జాడ గర్తించేందుకు అన్వేషణ కొనసాగుతున్న సమయంలో, ఆమెను మధ్యప్రదేశ్‌లో గుర్తించాం. బుధవారం ఆమెను ఔరైయాకు తీసుకొచ్చాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’’ అని అశోక్ కుమార్ చెప్పారు. ఆమె మధ్యప్రదేశ్‌లో ఏమి చేస్తోంది, ఇంతకాలం పాటు కుటుంబాన్ని ఎందుకు సంప్రదించలేదు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పటికే కోర్టులో నడుస్తున్న కేసుపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశముందని ఒక అధికారి చెప్పారు.
Read Also- IOB Good News: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అదిరిపోయే గుడ్‌న్యూస్