Asia Cup Trophy: భారత జట్టు ఆసియా కప్-2025ను గెలుచుకొని రెండు రోజులు దాటిపోయింది. కానీ, ట్రోఫీ, ఆటగాళ్ల మెడల్స్‌ను (Asia Cup Trophy) మాత్రం టీమిండియా ఇంతవరకు స్వీకరించలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్‌గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించబోమని భారత ఆటగాళ్లు తెగేసి చెప్పడంతో ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా జరిగింది. భారత ఆటగాళ్లు పట్టువిడువకపోవడంతో మోహ్సిన్ నక్వీ ఆసియా కప్ ట్రోఫీని తీసుకొని మైదానం నుంచి వెళ్లిపోయాడు. తనతో పాటే ట్రోఫీని కూడా హోటల్‌కు తీసుకెళ్లిపోయాడు.
అనూహ్య పరిణామాల అనంతరం కూడా ఆసియా కప్ ట్రోఫీని భారత ఆటగాళ్లకు ఎప్పుడు అందిస్తారనేదానిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే, మోహ్సిన్ నక్వీ ట్రోఫీని భారత్‌కు అందించడానికి సిద్ధంగా ఉన్నాడని, కానీ, ఒక్క షరతు విధిస్తానంటున్నాడని తెలుస్తోంది. భారత్ జట్టు ట్రోఫీతో పాటు మెడల్స్ స్వీకరించాలంటే, ఒక అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని, ఆ కార్యక్రమంలో తానే స్వయంగా ట్రోఫీ, మెడల్స్ అందిస్తానంటూ షరతు విధించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు టోర్నమెంట్ నిర్వాహకులకు నక్వి సందేశం ఇచ్చినట్టుగా ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. భారత్ – పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు చాలా సున్నితంగా మారిపోయిన నేపథ్యంల, అధికారిక కార్యక్రమం నిర్వహించి, అందులో మోహ్సిన్ నక్వీ పాల్గొనే అవకాశం ఇవ్వడం దాదాపు జరగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన
కాగా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ట్రోఫీ, మెడల్స్‌ను నక్వీ తన హోటల్ గదికి తీసుకెళ్లిన తీరు తీవ్ర బాధాకరమని మండిపడ్డారు. భారత్ జట్టు స్వీకరించాల్సిన ట్రోఫీని మోహ్సిన్ నక్వీ తన హోటల్ గదికి తీసుకెళ్లడంతో ప్రపంచ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు నక్వీ హాజరయ్యాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు ట్రోఫీ అందించేందుకు వేదికపైకి వెళ్లాడు. కానీ, అతడి చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ స్వీకరించేందుకు టీమిండియా ఆటగాళ్లు నిరాకరించారు. తటస్థ వ్యక్తుల చేతుల మీదుగా ఇప్పించాలని పట్టుబట్టారు. దీంతో, కాసేపు అసహానంతో ఎదురుచూసిన నక్వీ వేదికను వదిలి స్టేడియం నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయారు. దీంతో, ట్రోఫీ, మెడల్స్ అందుకోకుండానే భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు.
Read Also- Quetta Blast: పాకిస్థాన్‌లో శక్తివంతమైన కారుబాంబు పేలుడు.. 13 మంది దుర్మరణం
కాగా, ఆసియా కప్ ట్రోఫీని అందించకుండా మోహ్సిన్ నక్వీ తనవెంటే తీసుకెళ్లిపోవడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దృష్టికి తీసుకెళ్లనున్నట్టు బీసీసీఐ అధికారులు తెలిపారు. క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా నక్వి వ్యవహరించారని బీసీసీఐ కార్యదర్శి సైకియా మండిపడ్డారు.
కాగా, ఆసియా కప్ ట్రోఫీని అందించకుండా మోహ్సిన్ నక్వీ తనవెంటే తీసుకెళ్లిపోవడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దృష్టికి తీసుకెళ్లనున్నట్టు బీసీసీఐ అధికారులు తెలిపారు. క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా నక్వి వ్యవహరించారని బీసీసీఐ కార్యదర్శి సైకియా మండిపడ్డారు. ట్రోఫీ, మెడల్స్ త్వరగా భారత్‌కు తిరిగి చేరాలని ఆశిస్తున్నామని, దీనిపై కచ్చితంగా నిరసన తెలుపుతామని చెప్పారు.