Non Veg Shops Closed: ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి ఒకే రోజున వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం అమ్మకాలపై అధికారులు నిషేధం విధిస్తుంటారు. ఈ నేపథ్యంలో దసరా రోజున మాంసం విక్రయాలు కష్టమేనంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని నిజం చేస్తూ జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2న నగరంలో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించింది.
జీహెచ్ఎంసీ ప్రకటనలో ఏముందంటే?
అక్టోబర్ 2న మాంసం విక్రయాల మూసివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్వీ కర్ణన్ (RV Karnan) అధికారిక ప్రకటన విడుదల చేశారు. మహత్మాగాంధీ జయంతి సందర్భంగా చికెన్, మటన్, ఫిష్ తదితర మాంసం దుకాణాలను క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. దుకాణాల బంద్ కు సంబంధించి జీహెచ్ఎంసీ – 1955లోని 533బీ చట్టం ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం కూడా లభించిందని తెలిపారు. కాబట్టి అక్టోబర్ 2న నగరంలో మాంసం విక్రయాలు జరగకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా మాంసం విక్రయిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు.
మద్యం దుకాణాలు సైతం..
మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా మాంసం షాపులతో పాటు మద్యం అమ్మకాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా లిక్కర్ షాపు యజమానులు ఈ రూల్ పాటించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే మద్యం షాపుల ఎదుట షాప్ క్లోజ్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి షాప్ క్లోజింగ్ బోర్డులు.. ఒక రోజు ముందు వైన్స్ షాపు నిర్వాహకులు పెడుతుంటారు. కానీ దసరా పండుగ వేళ మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున జరగనున్న నేపథ్యంలో కొనుగోలు దారులకు కొద్ది రోజుల ముందు నుంచే సెలవు గురించి తెలియజేస్తున్నారు.
Also Read: TG DGP: కంటతడి పెట్టిన డీజీపీ.. వీడ్కోలు సభలో.. బాధను వెళ్లగక్కిన జితేందర్
నిషేధం ఎందుకంటే
నేషనల్ హాలీడేస్ గా పేర్కొనే రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తుంటారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు గుర్తుగా గాంధీ జయంతి రోజున ఎలాంటి హింసకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో మద్యం నిషేధాన్ని ప్రతీ సంవత్సరం అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే గాంధీజీ వెజిటేరియన్ కాబట్టి.. ఆయన జీవనశైలిని గౌరవించే ఉద్దేశ్యంతో మాంసాన్ని సైతం ఆ రోజున విక్రయించేందుకు అనుమతి లేదు. కాబట్టి అక్టోబర్ 2న ఎవరైన మద్యం, మాంసం విక్రయిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.