Telangana Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Elections) పోటీ చేయాలని ఆసక్తి ఉన్నా.. ఇద్దరికంటే ఎక్కువగా పిల్లలు ఉండటంతో నైరాశ్యానికి గురవుతున్నారు. వారికి 1995 లో చేసిన పంచాయతీరాజ్ చట్టం (, Panchayat Raj Act) గొడ్డలిపెట్టుగా మారింది. దానిని సవరించాలని గతంలో గత ప్రభుత్వాలకు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ చొరవ తీసుకోలేదు. దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడల్లా గెలిచినవారిపై ఓడినవారు కోర్టులకు వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ప్రజాప్రభుత్వంపై ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. మార్పులు చేసి తమకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని భావించారు. కానీ మార్పులు చేయకపోవడంతో నిరాశే మిగిలింది.
Also Read: Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్
స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వెనుకంజ
జనాభా నియంత్రణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1995 మే 30న పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా చేర్చారు. దీంతో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగినవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో చాలా మంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వెనుకంజ వేస్తున్నారు. ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా ఓటమిపాలైన వారు కోర్టుకు వెళ్తున్న ఘటనలు ఉన్నాయి. అవికూడా ప్రతిసారి ఎన్నికల సమయంలో నిత్యకృత్యమయ్యాయి. కోర్టులు కొన్ని సార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్లీ వారు పై కోర్టులకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణను అసెంబ్లీ సమావేశాల్లో చేయడమేనని పలువురు పేర్కొంటున్నారు. అదే చట్టం చేసి 30 ఏళ్లుగడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సవరణ చేయలేదు.
ఇద్దరుకంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కు 1995 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ చట్టంతో పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లోనూ ఇద్దరుకంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హులు అని పేర్కొన్నారు. అయితే 2019లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనలు సడలించింది. దీంతో పోటీచేసేవారికి ఊరట లభించింది. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి నిబంధనలు సడలించలేదు.
మరోవైపు 1995 చట్టం
దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు 1995 చట్టం చేసిన చంద్రబాబునాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చేశారు. పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. అదే డిమాండ్ తెలంగాణలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి సైతం ఈ అంశాన్ని పలు సందర్భాల్లో తీసుకొచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం సవరణ చేయలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారికి నిరాశే ఎదురైంది.
Also Read: Indiramma Canteens: హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేవలం రూ.5కే వెరైటీ టిఫిన్స్, భోజనం