Hyderabad Festival Rush: బతుకమ్మ, దసరా పండుగలను స్వస్థలాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ పట్టణ వాసులు పల్లెకు పయనమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)లో వివిధ రకాల ఉద్యోగాల్లో , విద్యా, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్(Hyderabad)కు వచ్చి స్థిరపడిన వారంత స్వస్థలాలకు పయనం కావటంతో సిటీలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం గౌలీగూడ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు రావటంతో అక్కడి నుంచి బస్సులను నడపటాన్ని నిలిపేసిన ఆర్టీసి తిరిగి ఆదివారం ఉదయం నుంచి వివిధ జిల్లాలకు బస్సుల రాకపొకలను పునరుద్ధరించటంతో ఎంజీబీఎస్ తో పాటు జెబీఎస్ బస్ స్టేషన్లతో పాటు సికిందరాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సెలవులు తోడవడంతో ఎంజీబీఎస్ ఆదివారం తెరిచిన కొద్ది గంటల్లోనే కిక్కిరిసిపోయింది.
Also Read: Tariff on Movies: సినీ ఇండస్ట్రీకి ట్రంప్ షాక్.. సినిమాలపై 100 శాతం టారిఫ్ విధింపు
ప్లాట్‌ఫారాలపై అడుగు పెట్టలేని పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు వేలాదిగా తరలిరావడంతో ప్లాట్‌ఫారాలపై అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన బస్సులు వచ్చినట్టే నిమిషాల వ్యవధిలో నిండిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే వేలాది మంది తమ స్వస్థలాలకు పయనం కాగా, మంగళ, బుధవారాల్లో మరింత రెట్టింపు సంఖ్యలో నగరవాసులకు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఆ తర్వాత నిత్యం రద్దీ, ట్రాఫిక్ తో కన్పించే పలు మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ తగ్గుముఖం పట్టనుంది.
జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి
సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్ )లోనూ ప్రయాణికుల రద్దీ కన్పిస్తుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రయాణికుల రద్దీ ముందు అవి సరిపోవటం లేదని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడటంతో తోపులాటలు, వాగ్వాదాలు వంటి స్వల్ప ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. రిజర్వేషన్ లేని బోగీల్లో కాలు మోపడానికి కూడా వీల్లేని విధంగా జనం కిక్కిరిసి ప్రయాణాలు సాగించారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. అయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక ధరలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. రానున్న రెండు, మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇదే అదునుగా రెంట్ కార్ల డిమాండ్ కూడా పెరిగిపోయింది.
Also Read: Harish Rao: గురుకులలో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడం అన్యాయం.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు